ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల తీవ్రంగా స్పందించారు. నూతన రాజధాని అమరావతికి రూ.1050 కోట్లే ఇచ్చారని చెప్పారు. విద్యా సంస్ధలకు కేంద్రం ఇచ్చిన నిధులు ప్రహరీ గోడలకు కూడా పనికిరావన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తిరుపతి ఎన్నికల ప్రచార సభలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఢిల్లీకి తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్‌కు నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఐదేల్లు ఇస్తామంటే.
పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఇప్పడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని రాజసభ్యలో జైట్లీ ప్రకటించడం బాధాకరమన్నారు. ప్రజా ఉద్యమం మొదలు కాకముందే కేంద్రం స్పందించాలని, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వాలని కోరారు. తమకు పదువులు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంటూ.. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని మంత్రి గంటా స్పష్టం చేశారు.