Andhra Pradesh Chief Minister YS Jagan Request To Prime Minister Narendra Modi- Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయండి

Published Sat, Mar 18 2023 3:37 AM | Last Updated on Sat, Mar 18 2023 10:31 AM

Chief Minister YS Jagan's request to Prime Minister Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా, అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరించి రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని కోరారు.

రాష్ట్ర విభజన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులకు విన్నవించేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చిన వైఎస్‌ జగన్‌.. శుక్రవారం ఉదయం మోదీతో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతులు అందజేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించినా, కీలక అంశాలన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

రుణ పరిమితి పెంచండి 
2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానిని కోరారు. రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ చేస్తామంటూ పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం చెప్పిందని, దీనిపై సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు తీసుకుందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని వివరించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయి­న­ప్పటికీ నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని చెప్పారు.

2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో దానిని రూ.17,923 కోట్లకు తగ్గించారన్నారు. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

పోలవరానికి అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఏపీ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా ప్రాజెక్టు నిర్మాణం సాగిస్తోందని సీఎం.. ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్ది కాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వచ్చి  ప్రజలకు ఫలితాలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి రూ.2600.74 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

గత రెండేళ్లుగా ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,548 కోట్లను ఆమోదించాలని విన్నవించారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా నిబంధనలు సడలించాలని సూచించారు.

ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని తెలిపారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. 

ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు ఇలా...
తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావా­ల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరా చేసిన విద్యు­త్‌కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబా­లకు రాష్ట్రమే సొంతంగా రేషన్‌ ఇస్తోంది. తద్వారా దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏపీ చేసిన విజ్ఞప్తి సరైన­దేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి. కేంద్రం వి­ని­యో­గించని రేషన్‌ కోటాను రాష్ట్రానికి కేటాయించాలి.

♦ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తా­మంటూ పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం హామీ ఇ­చ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రా­యితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

♦ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాలో 18 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నా­యి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి.

♦ వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్‌ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి.

విభజన అంశాలపై అమిత్‌షాకు వినతి 
ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదం వంటి అంశాలపై మాట్లాడారు. తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. 

పార్లమెంట్‌లో ఘన స్వాగతం
ప్రధాని మోదీ, అమిత్‌షాతో భేటీకై పార్లమెంట్‌కు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, రెడ్డప్ప, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, పిల్లి సుభాస్‌ చంద్రబోస్, ఆర్‌.కృష్ణయ్య, చింతా అనురాధ, సత్యవతి, గొడ్డేటి మాధవిలు సాదర స్వాగతం పలికారు.

జగన్‌ పార్లమెంట్‌ భవనంలో లోపలికి వెళుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్, పీఎంఓ కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌లు పలకరించారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్‌ వైఎస్‌ జగన్‌తో ఫొటో దిగారు. కాగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం జగన్‌ ఢిల్లీ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement