ప్రధానితో భేటీలో కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం జగన్‌ | AP CM Jagan meets PM Modi Mention pending bifurcation issues | Sakshi
Sakshi News home page

ప్రధానితో భేటీలో కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం జగన్‌

Published Wed, Dec 28 2022 2:31 PM | Last Updated on Wed, Dec 28 2022 8:54 PM

AP CM Jagan meets PM Modi Mention pending bifurcation issues - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం జగన్‌. ముందుగా.. కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు. ఆపై రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, పైగా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని సీఎం జగన్‌, ప్రధానికి వివరించారు. 
 
గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం అయ్యిందని, అయినప్పటికీ కొంత పురోగతే కనిపిస్తోందని, కీలకాంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రధానికి వివరించారు సీఎం జగన్‌.  

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని, 2014–15 సంవత్సరానికి సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు. 

► గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, రుణాలపై పరిమితి విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీస్తాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం జగన్‌, ప్రధానిని కోరారు. 

► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92  కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  అలాగే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు అంశం కూడా ఇంకా పెండింగులోనే ఉంది. మొత్తం ప్రాజెక్టుకోసం రూ.55,548 కోట్ల రూపాయలు అవుతుందని టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ప్రధానమంత్రికి గుర్తుచేశారు సీఎం జగన్‌. డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లైని ప్రాజెక్టు నుంచి వేరుచేసి చూస్తున్నారని, దీన్ని ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జాతీయ హోదా పొందిన ఏ ప్రాజెక్టులోనైనా డ్రింకింగ్‌ వాటర్‌ను ప్రాజెక్టులో భాగంగా చూశారని ప్రస్తావించారు.

► పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూస్తున్నారని, బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడమే కాకుండా, వ్యయం కూడా పెరుగుతోందని ప్రధానికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యవయాన్ని కాంపొనెంట్‌ వైజ్‌గా చూడొద్దని, ఆ నిబంధనలను పూర్తిగా తొలగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

►  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని, దీనివల్ల చాలావరకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా  ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, ఆలస్యం అవుతున్నకొద్దీ ప్రాజెక్టు ఖర్చు పెరిగిపోతుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టునుంచి తక్షణమే ప్రయోజనాలను అందించడానికి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌, ప్రధాని మోదీకి వివరించారు.

                                ఇందులో భాగంగా 41.15 మీటర్ల ఎత్తు వరకూ ఆయా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని, ఈమేరకు పనులు చేయడానికి దాదాపు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని, ఈ డబ్బును అడహాక్‌గా మంజూరు చేసినట్టైతే పనులు వేగంగా ముందుకు సాగుతాయని పీఎంకు వివరించారు.  ఈ డబ్బు మంజూరు చేసినట్టైతే భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు  సకాలంలో పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్‌, ప్రధానికి తెలిపారు.

► తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరిన సీఎం జగన్‌, తద్వారా తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీజెన్‌కోకు ఈ బకాయిలు చాలా అవసరమని తెలిపారు.

► అలాగే.. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తంచేసిన అంశాలతో నీతి ఆయోగ్‌ కూడా  ఏకీభవించి కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సునూ ప్రస్తావించారు సీఎం జగన్‌. 

► రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, వీరికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తోందని, రూ.5,527 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని ప్రధానికి వివరించిన సీఎం. నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని.. ఈమేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

► రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పునరుద్ఘాటించిన సీఎం.

► రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలిపి ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాలో సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారని, మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని పీఎంను కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. 

► కడపలో నిర్మించనున్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు. 

► విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement