న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అక్టోబర్‌లో మళ్లీ ఈ చర్చలు జరగనున్నాయి. ఆ లోపు పాక్ తన వైఖరి మార్చుకొని ఉగ్రనిధులను ఆపకపోతే బ్లాక్ లిస్ట్‌లోనే ఉండిపోయే అవకాశం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగి ఉన్న ఈ ఎఫ్‌ఏటీఎఫ్ సదస్సుకు హోంశాఖ, విదేశాంగ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు.
పాక్ తరఫున పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందన్నది ఎఫ్‌ఏటీఎఫ్ ప్రధాన అభియోగం. ఈ బృందంలో 41 మంది సభ్యులు ఉండగా వారికి పాక్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఉగ్ర నిధులకు వ్యతిరేకంగా రూపొందించిన 11 అంశాల్లో పదింటిని కూడా చేరలేకపోయింది. ఇప్పటికే గ్రే లిస్టులో ఉన్న పాక్ అక్టోబర్ కల్లా బృంద సభ్యులను మెప్పించగలిగేలా ఉగ్రనిధులను కట్టడి చేయాల్సి ఉంటుందని మరో అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్న పాక్‌కు ఇది ఎదురు దెబ్బే.
ఐరాసలో ‘కశ్మీర్’ మాటెత్తనున్న ఇమ్రాన్
ఇస్లామాబాద్: కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చూపించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నా.. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావటం లేదు. త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 27వ తేదీన ప్రధాని ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారయిందని ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌పై భారత్ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ప్రసంగించే అవకాశముందని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకోనున్న భారత ప్రధాని మోదీ వద్ద... భారత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముస్లిం సంఘాలు, మానవ హక్కుల సంఘాలకు ఇమ్రాన్ సూచించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ఉందని ఆ పత్రిక పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంపై భారత్‌తో సంబంధాలను పాక్ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment