చుక్కల్లో నీళ్లు.. మట్టిలో కోట్లు! | water drought in distic wastage of funds | Sakshi
Sakshi News home page

చుక్కల్లో నీళ్లు.. మట్టిలో కోట్లు!

Published Thu, Mar 31 2016 4:23 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

చుక్కల్లో నీళ్లు.. మట్టిలో కోట్లు! - Sakshi

చుక్కల్లో నీళ్లు.. మట్టిలో కోట్లు!

చేవెళ్ల తాగునీటి పథకంలో
రూ.18.29 కోట్లు నిరుపయోగం
ప్రభుత్వ నిర్వాకంపై మండిపడిన
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  (కాగ్)
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల వివరణపై అసంతృప్తి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  జలమండలి, గ్రామీణ నీటి సరఫరా విభాగం నిర్వాకం వల్ల రూ.18.29 కోట్ల నిధులు నిరుపయోగంగా మారినట్లు ‘కాగ్’ స్పష్టం చేసింది. చేవెళ్ల ప్రాంతానికి మంజీర? జలాలను తరలింపు పథకంలో అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా ఆక్షేపించిన కాగ్.. సరిపడా నీళ్లులేకున్నా పథకాన్ని చేపట్టడాన్ని తప్పుబట్టింది. బుధవారం శాసనసభలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రవేశపెట్టింది. చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు సమగ్ర రక్షిత నీటి పథకం (సీపీడబ్ల్యూఎస్) కింద తాగునీరు అందించాలని 2008లో అప్పటి సర్కారు నిర్ణయించింది.

ఈ మేరకు రూ.20 కోట్లను మంజూరు చేసింది. శంకర్‌పల్లి మండలం సింగాపూర్ జలాశయం మీదుగా ప్రతి రోజు 2,114 కిలోలీటర్ల నీటిని తరలించాలని రూపొందించిన ప్రణాళికకు జలమండలి ఆమోద ముద్ర వేసింది. ఈ - ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ముంబైకి చెందిన ‘ఇండియన్ హ్యుమ్’ పైపుల తయారీ సంస్థకు పనులను కట్టబెట్టింది. జూన్ 2009 నాటికీ పనులను పూర్తి చేయాలని నియామవళిలో ఉన్నా.. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. ఇలా కొనసాగుతూ వచ్చిన పనులను సదరు సంస్థ 2013వ సంవత్సరంలో పూర్తి చేసింది. అయితే, పథకం పనులు పూర్తయినా ఈనాటికీ కూడా చుక్కనీటి సరఫరా జరగలేదని కాగ్ తన పరిశీలనలో తేల్చింది.

విచిత్రమేమిటంటే.. సింగాపూర్ జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు జలమండలి అనుమతి నిరాకరించడం. శివారు ప్రాంతాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయడం వల్ల ఇక్కడ తాగునీటి అవసరాలు పెరిగిపోతాయని, తద్వారా చేవెళ్లకు నీటి సరఫరాను చేయలేమని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో పునాది రాయి పడి తొమ్మిదేళ్లయినా పథకం ముందుకు సాగలేదు. గుక్కెడు నీటిని సరఫరా చేయకుండా రూ.18.29 కోట్లను బూడిదలో పోసిన పన్నీరులా మార్చినట్లు అభిప్రాయపడింది. ఈ పథకాన్ని వాడుకలోకి తీసుకురాకుండా..

అటు ప్రభుత్వం గానీ, ఇటు జలమండలిని కానీ ప్రయత్నించకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో (ట్రయల్ రన్) ఉందని, 2015వ సంవత్సరం అక్టోబర్ చివరికల్లా వినియోగంలోకి వస్తుందని ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో కాగ్ సంతృప్తి పడలేదు. ప్రస్తుత పరిస్థితులలో చేవెళ్ల ప్రాంతానికి సింగాపూర్ జలాశయం నుంచి నీళ్లివ్వలేమని గతేడాది నవంబర్‌లో జలమండలి మారోమారు స్పష్టం చేసినందున  గ్రామీణ నీటి సరఫరా విభాగం వివరణను తోసిపుచ్చింది.

జిల్లాకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలను కాగ్ ఎండట్టింది. రిజిస్ట్రేషన్లు మొదలు స్టాంపు డ్యూటీ, దస్తావేజుల విలువ కేటాయింపులో నిర్లక్ష్యం, మధ్యాహ్న భోజనం, వాణిజ్య పన్నులు, స్థానిక సంస్థలు తదితర అంశాలపై పరిశీలన చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం అధికారుల నిర్లక్ష్యంతో హరించుకుపోయిందని మండిపడింది. కాగ్ నివేదికలోని అంశాలు మచ్చుకు కొన్ని....

ఆస్తుల విలువ తక్కువగా లెక్కించి పన్ను తక్కువగా విధించిన క్రమంలో రంగారెడ్డి తూర్పు విభాగం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, నారపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాల పరిధిలో ఏకంగా రూ. 2.5 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.

దస్తావేజులను తప్పుగా వర్గీకరించి స్టాంపు డ్యూటీని తక్కువ చేయడంతో చంపాపేట, ఉప్పల్, వికారాబాద్ ఎస్‌ఆర్‌ఓల పరిధిలో ప్రభుత్వానికి రూ. 1.84 కోట్ల ఆదాయం తగ్గిందని నిర్ధారించింది.

ఆస్తి అంచనాలో తప్పుడు లెక్కలు చూపడం, జీపీఏపై స్టాంపు డ్యూటీ తగ్గించడంతో రంగారెడ్డి, తూర్పు, పశ్చిమ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రూ. 1.12 కోట్ల ఆదాయం పరులపాలైందని కాగ్ ఆగ్రహించింది.

రిజిస్టర్ చేయని వాటిని రిజిస్ట్రేషన్ చేయక నిరాకరించడంతో రూ. 51.53 లక్షల ఆదాయం సర్కారు ఖజానాకు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు.

నగర శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న కొన్ని ఎన్జీఓలు ఆడిట్ నివేదికలు సమర్పించక పోవడాన్ని కాగ్ ఆక్షేపించింది.

అక్షరాస్యత కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో జిల్లాలో శాతం పెరుగుదల స్థిరంగా ఉందని కాగ్ పేర్కొనగా.. ప్రభుత్వం స్పందిస్తూ ఈ కార్యక్రమాల వేగాన్ని పెంచుతామని ప్రకటించింది.

తపాలా శాఖ ద్వారా మీ సేవల్ని విస్తృత పర్చాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఆపరేటర్ల మార్పుతో పలు కేంద్రాలు మూతబడినట్లు తెలుస్తోందని కాగ్ పేర్కొంది.

సమగ్ర నీటియాజమాన్య నిర్వహణ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలో 18 ప్రాజెక్టులు అటకెక్కినట్లు కాగ్ గుర్తించింది.

జిల్లా విద్యాశాఖలో 2014-15 వార్షికంలో కొన్ని కేటగిరీలకు సంబంధించి అదనపు బిల్లులు డ్రా చేసినట్లు కాగ్ వివరించింది.

జిల్లాలోని 4 ఉప ఖజానా శాఖ కార్యాలయాల పరిధిలో ఏడాది కాలంగా పదవీ విరమణ పొందిన పోలీసులకు సంబంధించి పెన్షన్లు డ్రా చేయడం లేదని, దీంతో వారి స్థితిపై సందిగ్ధత నెలకొందని కాగ్ పేర్కొంది.

వాణిజ్య పనుల విభాగంలో డీలరు పన్ను చెల్లించకపోవడంతో జీడిమెట్ల, నాచారం డివిజన్లలో రూ. 5.93 కోట్ల ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది.

అంతర్ రాష్ట్ర అమ్మకాలపై రాయితీ రేట్లను తప్పుగా పేర్కొనడంతో కీసర, నాచారం, తార్నాక, సరూర్‌నగర్, డివిజన్లలో రూ. 3.69 కోట్ల నష్టం వాటిల్లిందని వాణిజ్య పన్నుల శాఖపై కాగ్ అక్షింతలు వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement