Water supply department
-
వేసవిలోనూ తాగునీరు పుష్కలం!
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేస్తోంది. భూగర్భ జలాలతోపాటు చెరువుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో ఈ వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వేసవి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను ఆర్డబ్ల్యూఎస్ సిద్ధం చేస్తుంటుంది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో ఏటా నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నట్టు జిల్లాల నుంచి నివేదికలు అందాయి. సాధారణంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన గ్రామాల్లో మూడొంతులు చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామాలే ఉంటాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం అత్యధికంగా వర్షాలు కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో జనవరి నెలలో సాధారణం కంటే 39.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఏటా నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో సాధారణం కంటే 55.9 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు చెబుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎండిపోయినట్టు ఏ ప్రాంతం నుంచి సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో.. కాగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాల్లోని గ్రామాల్లో నడివేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో రాష్ట్రమంతటా అధిక వర్షాలు నమోదైనా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 4 శాతం తక్కువగా వర్షాలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లోని పరిస్థితులపై అర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు రప్పించుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్చి మధ్యలో మరోసారి అంచనా ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అన్ని గ్రామాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని సమాచారం అందడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరి–ఫిబ్రవరిల్లో సిద్ధం చేయాల్సిన మంచినీటి సరఫరా కార్యాచరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మార్చి మొదటి వారం తర్వాత జిల్లాల నుంచి మరోసారి సమాచారం రప్పించుకుని యాక్షన్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
సోలార్ ‘పవర్’
సాక్షి, సిటీబ్యూరో: మహానగర తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సౌర విద్యుత్ (సోలార్ పవర్) వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారించింది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్ చార్జీలతో బోర్డు ఆర్థికంగా కుదేలవుతోన్న నేపథ్యంలో సోలార్ పవర్‌తో కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) సౌజన్యంతో ప్రయోగాత్మకంగా 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం రూపొందించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే జలమండలికి సంబంధించిన 50 రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల వద్ద సౌర పలకలు ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని టీఎస్రెడ్కో సొంతంగా సమకూర్చుకోనుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను జలమండలి యూనిట్‌కు రూ.3 చొప్పున కొనుగోలు చేస్తుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం జలమండలికి యూనిట్‌కు రూ.5.60 చొప్పున విద్యుత్ సరఫరా అవుతున్న విషయం విదితమే. కరెంట్ కష్టాలు దూరం... ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక వాటర్ బోర్డు ఆపసోపాలు పడుతోంది. దీనికి తోడు ప్రతినెల సుమారు రూ.75 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరా చేసేందుకు నెలకు దాదాపు 120 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏక మొత్తంలో సుమారు రూ.600 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ప్రాజెక్టు సాకారమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 30 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ముందడుగు వేయడం విశేషం. బిల్లులతో షాక్... జలమండలికి నెలవారీగా నీటి బిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.95 కోట్ల మేర సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు మించుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.75 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటి శుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.37 కోట్లు వ్యయమవుతోంది. ప్రతినెలా బోర్డు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.100 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాకు షాక్‌లా పరిణమిస్తోంది. -
చుక్కల్లో నీళ్లు.. మట్టిలో కోట్లు!
♦ చేవెళ్ల తాగునీటి పథకంలో ♦ రూ.18.29 కోట్లు నిరుపయోగం ♦ ప్రభుత్వ నిర్వాకంపై మండిపడిన ♦ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ♦ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల వివరణపై అసంతృప్తి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జలమండలి, గ్రామీణ నీటి సరఫరా విభాగం నిర్వాకం వల్ల రూ.18.29 కోట్ల నిధులు నిరుపయోగంగా మారినట్లు ‘కాగ్’ స్పష్టం చేసింది. చేవెళ్ల ప్రాంతానికి మంజీర? జలాలను తరలింపు పథకంలో అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా ఆక్షేపించిన కాగ్.. సరిపడా నీళ్లులేకున్నా పథకాన్ని చేపట్టడాన్ని తప్పుబట్టింది. బుధవారం శాసనసభలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రవేశపెట్టింది. చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు సమగ్ర రక్షిత నీటి పథకం (సీపీడబ్ల్యూఎస్) కింద తాగునీరు అందించాలని 2008లో అప్పటి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రూ.20 కోట్లను మంజూరు చేసింది. శంకర్పల్లి మండలం సింగాపూర్ జలాశయం మీదుగా ప్రతి రోజు 2,114 కిలోలీటర్ల నీటిని తరలించాలని రూపొందించిన ప్రణాళికకు జలమండలి ఆమోద ముద్ర వేసింది. ఈ - ప్రొక్యూర్మెంట్ విధానంలో ముంబైకి చెందిన ‘ఇండియన్ హ్యుమ్’ పైపుల తయారీ సంస్థకు పనులను కట్టబెట్టింది. జూన్ 2009 నాటికీ పనులను పూర్తి చేయాలని నియామవళిలో ఉన్నా.. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. ఇలా కొనసాగుతూ వచ్చిన పనులను సదరు సంస్థ 2013వ సంవత్సరంలో పూర్తి చేసింది. అయితే, పథకం పనులు పూర్తయినా ఈనాటికీ కూడా చుక్కనీటి సరఫరా జరగలేదని కాగ్ తన పరిశీలనలో తేల్చింది. విచిత్రమేమిటంటే.. సింగాపూర్ జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు జలమండలి అనుమతి నిరాకరించడం. శివారు ప్రాంతాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడం వల్ల ఇక్కడ తాగునీటి అవసరాలు పెరిగిపోతాయని, తద్వారా చేవెళ్లకు నీటి సరఫరాను చేయలేమని వాటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో పునాది రాయి పడి తొమ్మిదేళ్లయినా పథకం ముందుకు సాగలేదు. గుక్కెడు నీటిని సరఫరా చేయకుండా రూ.18.29 కోట్లను బూడిదలో పోసిన పన్నీరులా మార్చినట్లు అభిప్రాయపడింది. ఈ పథకాన్ని వాడుకలోకి తీసుకురాకుండా.. అటు ప్రభుత్వం గానీ, ఇటు జలమండలిని కానీ ప్రయత్నించకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టు ప్రయోగ దశలో (ట్రయల్ రన్) ఉందని, 2015వ సంవత్సరం అక్టోబర్ చివరికల్లా వినియోగంలోకి వస్తుందని ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో కాగ్ సంతృప్తి పడలేదు. ప్రస్తుత పరిస్థితులలో చేవెళ్ల ప్రాంతానికి సింగాపూర్ జలాశయం నుంచి నీళ్లివ్వలేమని గతేడాది నవంబర్‌లో జలమండలి మారోమారు స్పష్టం చేసినందున గ్రామీణ నీటి సరఫరా విభాగం వివరణను తోసిపుచ్చింది. ⇒జిల్లాకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలను కాగ్ ఎండట్టింది. రిజిస్ట్రేషన్లు మొదలు స్టాంపు డ్యూటీ, దస్తావేజుల విలువ కేటాయింపులో నిర్లక్ష్యం, మధ్యాహ్న భోజనం, వాణిజ్య పన్నులు, స్థానిక సంస్థలు తదితర అంశాలపై పరిశీలన చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం అధికారుల నిర్లక్ష్యంతో హరించుకుపోయిందని మండిపడింది. కాగ్ నివేదికలోని అంశాలు మచ్చుకు కొన్ని.... ⇒ ఆస్తుల విలువ తక్కువగా లెక్కించి పన్ను తక్కువగా విధించిన క్రమంలో రంగారెడ్డి తూర్పు విభాగం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, నారపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్ ఎస్ఆర్ఓ కార్యాలయాల పరిధిలో ఏకంగా రూ. 2.5 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ⇒ దస్తావేజులను తప్పుగా వర్గీకరించి స్టాంపు డ్యూటీని తక్కువ చేయడంతో చంపాపేట, ఉప్పల్, వికారాబాద్ ఎస్ఆర్ఓల పరిధిలో ప్రభుత్వానికి రూ. 1.84 కోట్ల ఆదాయం తగ్గిందని నిర్ధారించింది. ⇒ ఆస్తి అంచనాలో తప్పుడు లెక్కలు చూపడం, జీపీఏపై స్టాంపు డ్యూటీ తగ్గించడంతో రంగారెడ్డి, తూర్పు, పశ్చిమ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రూ. 1.12 కోట్ల ఆదాయం పరులపాలైందని కాగ్ ఆగ్రహించింది. ⇒రిజిస్టర్ చేయని వాటిని రిజిస్ట్రేషన్ చేయక నిరాకరించడంతో రూ. 51.53 లక్షల ఆదాయం సర్కారు ఖజానాకు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు. ⇒నగర శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న కొన్ని ఎన్జీఓలు ఆడిట్ నివేదికలు సమర్పించక పోవడాన్ని కాగ్ ఆక్షేపించింది. ⇒ అక్షరాస్యత కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో జిల్లాలో శాతం పెరుగుదల స్థిరంగా ఉందని కాగ్ పేర్కొనగా.. ప్రభుత్వం స్పందిస్తూ ఈ కార్యక్రమాల వేగాన్ని పెంచుతామని ప్రకటించింది. ⇒ తపాలా శాఖ ద్వారా మీ సేవల్ని విస్తృత పర్చాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఆపరేటర్ల మార్పుతో పలు కేంద్రాలు మూతబడినట్లు తెలుస్తోందని కాగ్ పేర్కొంది. ⇒ సమగ్ర నీటియాజమాన్య నిర్వహణ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలో 18 ప్రాజెక్టులు అటకెక్కినట్లు కాగ్ గుర్తించింది. ⇒ జిల్లా విద్యాశాఖలో 2014-15 వార్షికంలో కొన్ని కేటగిరీలకు సంబంధించి అదనపు బిల్లులు డ్రా చేసినట్లు కాగ్ వివరించింది. ⇒ జిల్లాలోని 4 ఉప ఖజానా శాఖ కార్యాలయాల పరిధిలో ఏడాది కాలంగా పదవీ విరమణ పొందిన పోలీసులకు సంబంధించి పెన్షన్లు డ్రా చేయడం లేదని, దీంతో వారి స్థితిపై సందిగ్ధత నెలకొందని కాగ్ పేర్కొంది. ⇒ వాణిజ్య పనుల విభాగంలో డీలరు పన్ను చెల్లించకపోవడంతో జీడిమెట్ల, నాచారం డివిజన్లలో రూ. 5.93 కోట్ల ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. ⇒ అంతర్ రాష్ట్ర అమ్మకాలపై రాయితీ రేట్లను తప్పుగా పేర్కొనడంతో కీసర, నాచారం, తార్నాక, సరూర్‌నగర్, డివిజన్లలో రూ. 3.69 కోట్ల నష్టం వాటిల్లిందని వాణిజ్య పన్నుల శాఖపై కాగ్ అక్షింతలు వేసింది.