సాక్షి, సిటీబ్యూరో: మహానగర తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సౌర విద్యుత్ (సోలార్ పవర్) వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారించింది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్ చార్జీలతో బోర్డు ఆర్థికంగా కుదేలవుతోన్న నేపథ్యంలో సోలార్ పవర్‌తో కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్‌కో) సౌజన్యంతో ప్రయోగాత్మకంగా 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం రూపొందించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే జలమండలికి సంబంధించిన 50 రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల వద్ద సౌర పలకలు ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని టీఎస్‌రెడ్‌కో సొంతంగా సమకూర్చుకోనుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను జలమండలి యూనిట్‌కు రూ.3 చొప్పున కొనుగోలు చేస్తుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం జలమండలికి యూనిట్‌కు రూ.5.60 చొప్పున విద్యుత్ సరఫరా అవుతున్న విషయం విదితమే.
కరెంట్ కష్టాలు దూరం...
ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక వాటర్ బోర్డు ఆపసోపాలు పడుతోంది. దీనికి తోడు ప్రతినెల సుమారు రూ.75 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరా చేసేందుకు నెలకు దాదాపు 120 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏక మొత్తంలో సుమారు రూ.600 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ప్రాజెక్టు సాకారమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 30 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ముందడుగు వేయడం విశేషం.
బిల్లులతో షాక్...
జలమండలికి నెలవారీగా నీటి బిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.95 కోట్ల మేర సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు మించుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.75 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటి శుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.37 కోట్లు వ్యయమవుతోంది. ప్రతినెలా బోర్డు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.100 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాకు షాక్‌లా పరిణమిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment