KTR Good News for the Unemployed - Sakshi
Sakshi News home page

నేడో రేపో భృతి

Jan 28 2021 4:55 PM | Updated on Jan 29 2021 5:13 AM

KTR: Telangana Ranks Second In Solar Power - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌ : నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపో మాపో నిరుద్యోగ భృతిపైనా ప్రకటన చేస్తారని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలో నోటిఫి3 కేషన్‌ వెలువడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌)లో తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం (టీఎన్‌వీకేఎస్‌) విలీనమైన సందర్భంగా గురువారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలసి కేటీఆర్‌ పాల్గొ న్నారు.

‘ఆరున్నరేండ్లలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 36 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు ప్రభుత్వశాఖల్లో అదనంగా మరో 45 వేల ఉద్యో గాలు ఇచ్చాం. జెన్‌కో, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చిన ఉద్యోగాలను కలుపుకుంటే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొత్తం 1.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. పారిశ్రామిక విధానం ద్వారా రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 14 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులివ్వగా, సుమారు 14.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘కొత్తగా మతం పుచ్చుకున్నోడు ఒళ్లంత బూడిద పూసు కున్నట్లు.. నిన్న, ఇవాళ కండ్లు తెరచిన కొందరు నేతలు రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.

సీఎం వయసును, తెలంగాణ తెచ్చిన విషయాన్ని మరచిపోయి విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ లేకపోతే వీళ్ల బతుక్కి పదవులు కూడా లేవు. ఒకాయన టీపీసీసీ అధ్యక్షుడు..  ఇంకొకాయన టీబీజేపీ అధ్యక్షుడు. ఎగిరి పడు తున్న నాయకులారా.. కేసీఆర్‌ వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన వల్ల మీకు పదవులు వచ్చాయి. ప్రతిదానికి హద్దు ఉంటుంది’ అని కేటీఆర్‌  తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

విద్యుత్‌ రంగంలో తెలంగాణ ఘనవిజయం
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 450 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆంధ్రాకు అప్పగించినా, విద్యుత్‌ సమస్యను సవాలుగా తీసుకుని సీఎం కేసీఆర్‌ పరిష్కరించారని కేఆటీర్‌ వ్యాఖ్యానించారు. 2014కు ముందు తెలంగాణలో స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7 వేల మెగావాట్లు కాగా, సీఎం దూరదృష్టితో ప్రస్తుతం అది 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. దామరచర్ల, ఎన్‌టీపీసీలో అల్ట్రా మెగావపర్‌ ప్రాజెక్టుల నిర్మాణం జరుగతోందని, గ్రీన్, రెన్యూవల్‌ ఎనర్జీ ఉత్పాదనలో 4 వేలకుపై చిలుకు మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందని చెప్పారు.

తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని, కరోనా మూలంగా ఆర్థికాభివృద్ధి మందగించినా ఉద్యోగులకు ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆరేండ్ల వ్యవధిలోనే విద్యుత్‌ సంస్థల్లో 9 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు, 23 వేలకుపైగా తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్‌ చేసిన విషయాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు.

సమావేశంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బండి రమేశ్, టీఆర్‌వీకేఎస్‌ నేతలు జాన్సన్, రమేశ్, ప్రకాశ్, టీఎన్‌వీకేఎస్‌ నాయకులు మహేందర్, రాంబాబు, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement