
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ).. ఓఎన్‌జీసీ పెట్రో–అడిషన్స్ లిమిటెడ్‌కు (ఓపీఏఎల్) సుమారు రూ.15,000 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. అధిక రుణభారం కారణంగా నష్టపోతున్న ఓపీఏఎల్‌కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణకు ఓఎన్‌జీసీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది.
గుజరాత్‌లోని దహేజ్ వద్ద భారీ పెట్రోకెమికల్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఓపీఏఎల్‌లో ఓఎన్‌జీసీకి 49.36 శాతం, గెయిల్ ఇండియాకు 49.21, గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్ప్‌నకు (జీఎస్‌పీసీ) 1.43 శాతం వాటా ఉంది. ఓపీఏఎల్‌కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా షేర్ వారెంట్లను ఈక్విటీగా ఓఎన్‌జీసీ మారుస్తుంది. రూ.7,778 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను బైబ్యాక్ చేస్తుంది.
అలాగే ఈక్విటీ రూపంలో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా ఓపీఏఎల్‌లో దాదాపు 95 శాతం వాటా సమకూరుతుందని స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్‌లో ఓఎన్‌జీసీ వెల్లడించింది. ఇది అమలు చేసిన తర్వాత ఓఎన్‌జీసీకి ఓపీఏఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. ‘ఆర్థిక పునరి్నర్మాణంతో ఓపీఏఎల్‌లో ఓఎన్‌జీసీ హోల్డింగ్‌ను పెంచుతుంది. ఓపీఏఎల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.14,864 కోట్లుగా ఉంటుంది’ అని ఓఎన్‌జీసీ పేర్కొంది.
పునర్ వ్యవస్థీకరణ తరువాత ఓపీఏఎల్‌లో గెయిల్, జీఎస్‌పీసీ వాటా 5 శాతానికి పరిమితం అవుతుంది. 2008లో ఓపీఏఎల్‌లో గెయిల్ వాటాను కైవసం చేసుకుంది. దహేజ్ ప్లాంట్ ప్రణాళిక సమయంలో రూ.12,440 కోట్లతో అంచనా వేశారు. కానీ 2017లో దాదాపు రూ.30,000 కోట్లతో పూర్తయింది. ప్లాంటుకు భారీ వ్యయం, నిర్మాణం ఆలస్యం కావడంతో గెయిల్ తన ఈక్విటీ వాటాను రూ.996.28 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఓపీఏఎల్ నష్టాలు 2023 మార్చి నాటికి రూ.13,000 కోట్లకు చేరుకున్నాయి.