గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు | Villages 'employment' drought | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు

Published Fri, Mar 25 2016 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు

గ్రామాల్లో ‘ఉపాధి’ కరువు

ఉపాధిహామీ పనులు చేసిన కూలీలకు నెలన్నరగా వేతనాల్లేవ్
{పస్తుతం రోజుకు 1.70 లక్షలకు మించని కూలీల సంఖ్య
కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర విభాగాలకు మళ్లించిన సర్కారు
బకాయిల చెల్లింపునకు తక్షణం రూ.200 కోట్లు కావాలంటున్న అధికారులు


హైదరాబాద్: గ్రామీణ ప్రాంత పేదలకు ‘ఉపాధి’ దూరమవుతోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. పనులు చేసేందుకు కూలీలు మొగ్గు చూపడం లేదు. రాష్ట్రంలో ఉపాధిహామీ పనులకు నిధుల కొరతే దీనికి కారణమని తెలుస్తోంది. తొమ్మిది జిల్లాల్లో ఉపాధి పనులకు వెళుతున్న సమారు 9 లక్షల మంది కూలీలకు కొన్నాళ్లుగా వేతన చెల్లింపులు నిలిచిపోయాయి. దాదాపు నెలన్నరగా రోజువారీ వేతనాలు చేతికి అందకపోవడంతో పనులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో 44.86 లక్షల పనిదినాలు నమోదు కాగా, మార్చి మొదటి వారంలో 30.79 లక్షలు, రె ండో వారంలో 8.37 లక్షల పనిదినాలే నమోద య్యాయి. గత నెల ప్రారంభంలో రోజుకు 9 లక్షల మంది పనులకు హాజరుకాగా, ఈ నెల ప్రారంభంలో 6.52 లక్షల మంది హాజరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతవారం కేవలం 1.60 లక్షల మందే హాజరు కావడం ఉపాధిహామీ పనులపై కూలీల్లో నెలకొన్న అనాసక్తిని చెబుతోంది. ఉపాధి హామీ కింద కేంద్రం గత ఆగస్టులో రూ. 550 కోట్లు విడుదల చేసినా.. రాష్ట్రంలో ఉపాధి పనులకు నిధుల కొరత ఏర్పడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 10 శాతం నిధులను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర ప్రాజెక్ట్‌లకు మళ్లించింది. సర్కారు నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో కూలీలకు వేతనాలు చెల్లించలేక గ్రామీణాభివృద్ధి శాఖ చేతులెత్తేస్తోంది.

 
రూ.200 కోట్ల బకాయిలు..

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిహామీ పనులు జరిగిన ప్రాంతాల్లో సుమారు కోటికిపైగా పనిదినాలు పూర్తి చేసిన కూలీలకు దాదాపుగా రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద రోజుకు కూలీ రూ.180గా కేంద్రం నిర్ణయించినా సగటున రూ.130కి మించి లభ్యం కావడం లేదు. వేసవిలో ఉపాధిపనులు చేసే కూలీలకు కేంద్రం 20 నుంచి 35 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను ప్రకటించినా రూ.170 నుంచి 180లోపే వస్తుండడం, గత నెలన్నరగా అదీ చేతికి అందకపోవడంతో పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. ఫలితంగా గ్రామాల్లో పనులు మందగించాయి. కూలీలకు నెలన్నరగా వేతనాలు అందకపోవడంపై గ్రామీణాభివృద్ధి విభాగం సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో వేతనాల కోసం కూలీల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచే నిధులు రాకపోవడంతో కూలీలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని, పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఉపాధి పనులు సమృద్ధిగా ఉన్నా.. సకాలంలో వేతనాలు రాక కూలీలు ఇతర పనులు చూసుకుంటున్నారని చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తార కరామారావు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఉపాధిహామీకి నిధుల కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 12 లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నామని చెప్పడం విశేషం. మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు విని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement