భద్రాచలం: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆల యాన్ని అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 15న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి ఏ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారనే అంశంపై శనివారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాచలం అభివృద్ధికి ఏం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ తగిన ఆలోచన చేస్తున్నారని, ఇందుకోసం ఈ నెల 4న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు.
దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు, తాను కూడా ఆ సమావేశంలో పాల్గొంటానన్నారు. ‘శాశ్వత భద్రా ద్రి అభివృద్ధి’ కోసం సమగ్ర నివేదికలను తీసుకొని రావాల్సిందిగా జిల్లా కలెక్టర్, దేవస్థానం అధికారులకు సూచించినట్లుగా చెప్పారు. రామాలయ అభివృద్ధికి ఏం చేయాలి, ఎలా చేయాలనే దానిపై ఆధ్యాత్మిక నిపుణులు, పండితుల సమక్షంలో చర్చించిన మీదట నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిపారు. భద్రాచల రామాలయం అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడేది లేదన్నారు. జిల్లా లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం కూడా భద్రాచలంకు సమీపంలోనే ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రాములోరి కల్యాణానికి వస్తున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.