కృష్ణా పుష్కర ఏర్పాట్లకు అవసరమైన పనులు చేపట్టేందుకు వివిధ శాఖల ద్వారా సుమారు రూ.1600 కోట్ల నిధులు ....
విజయవాడ:కృష్ణా పుష్కర ఏర్పాట్లకు అవసరమైన పనులు చేపట్టేందుకు వివిధ శాఖల ద్వారా సుమారు రూ.1600 కోట్ల నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఏ పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కృష్ణా పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, నిర్ణీత గడువులో పనులు నాణ్యతతో పూర్తిచేసేందుకు వీలుగా ప్రతి పని ప్రారంభించినప్పటి నుంచి పూర్తి కావడానికి ఎన్ని రోజులు సమయం అవసరమో కచ్చితంగా పేర్కొనాలని ఆదేశించారు. అన్ని శాఖలు చేపట్టే పనులన్నీ, విభాగాల వారీగా స్వష్టంగా విభజించాలన్నారు.
భూసేకరణ, అవసరమైన పనుల సంఖ్య, గ్రామ సరిహద్దులో ఉండే విద్యుత్ స్తంభాలు, ఇతర వసతుల తొలగింపు తదితర విషయాలు పేర్కొనాలన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా వినియోగించి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న వివిధ శాఖలలో పరికరాలను గుర్తించి వాటిని కృష్ణా పుష్కరాలలో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. రోడ్లు భవనాల శాఖ గోదావరి పుష్కరాలకు కొనుగోలు చేసిన 100కి.మీ. బారికేడింగ్‌కు ఉపయోగించే పరికరాలను కృష్ణా జిల్లాకు తరలిస్తామని ఆ శాఖ ఎస్‌ఈ కె. శేషుకుమార్ కలెక్టర్‌కు వివరించారు.