ఏరియల్ సర్వే
► హెలికాప్టర్ నుంచి పుష్కరఘాట్లను
► పరిశీలించిన అదనపు డీజీపీ, ఉన్నతాధికారులు
► జూరాల నుంచి నాగార్జున్‌సాగర్ వరకు పర్యటన
► సర్వేలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
► పుష్కరాల ఏర్పాట్లు చకచకా
► పూర్తిచేయాలని కోరిన డీజీపీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న ఘాట్లను రాష్ట్ర అదనపు డీజీపీ(లాఅండ్ ఆర్డర్) అంజన్‌కుమార్, హైదరాబాద్ రీజియన్ ఐజీ నాగిరెడ్డి, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారంకృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన డీజీపీ నేరుగా జూరాల ప్రాజెక్టు మీదుగా బీచుపల్లి, అలంపూర్, సోమశిల తదితర ఘాట్లను పరిశీలించుకుంటూ నాగార్జున్‌సాగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన 32 ఘాట్లమ్యాప్‌ను అదనపు డీజీపీ స్వయంగా పరిశీలిస్తూ.. హెలిక్యాప్టర్ నుంచి ఆయా ఘాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఘాట్ల వివరాలు తీసుకుని త్వరగా పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం.
జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ వద్ద చర్చించినట్లు తెలిసింది. కేవలం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ కోసం అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు.
జాతీయ రహదారిపై ఉన్న బీచుపల్లి పుష్కరఘాట్‌కు కిలోమీటర్ దూరంలో వాహనాలు మొత్తం నిలిపివేయాలని కేవలం వీఐపీ తప్ప ఇతర వాహనాలకు లోపలికి అనుమతి లేకుండా అవసరమైన ప్రణాళిక ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బందోబస్తుపరంగా జిల్లా పోలీసుశాఖ నుంచి పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేయాలని అదనపు డీజీపీ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిని కోరినట్లు సమాచారం. వారి వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.