కృష్ణా పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు
► సీహెచ్ విజయమోహన్ ఆదేశం
► పాతాళగంగలో రెండు..
► లింగాలగట్టులో రెండు ఘాట్ల నిర్మాణం
► ఎస్పీతో కలిసి శ్రీశైలంలో పర్యటన
శ్రీశైలం : కృష్ణా పుష్కరాల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. పాతాళగంగ వద్ద 2, లింగాలగట్టులో 2 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, ఓఎస్‌డీ రవిప్రకాశ్, ఆర్డీఓ రఘుబాబు, దేవస్థానం ఈఓ సాగర్‌బాబు, జేఈఓ హరినాథ్‌రెడ్డి, డీఎస్పీ సుప్రజ తదితర అధికారులు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు పుష్కర ఏర్పాట్లపై క్షేత్ర పర్యటన చేశారు. అనంతరం శిఖరేశ్వరం చేరుకుని అక్కడి నుంచి సున్నిపెంట ఏరియల్ వ్యూను పరిశీలించారు. ముందుగా వారు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని భక్తుల కోసం ఏర్పాటు చేసిన షామియానాలు, క్యూలను పరిశీలించారు.
తరువాత పాతాళగంగ వద్దకు చేరుకుని ప్రస్తుతం ఉన్న ఘాట్ల పరిస్థితి, అదనంగా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి చర్చించారు. ప్రస్తుత మెట్ల మార్గంలోనే ఇన్, ఔట్ మార్గాలు, మధ్యలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తుల సంఖ్య మరింత పెరిగితే ప్లై ఓవర్ నిర్మించి రెండవ ఘాట్‌కు మళ్లించాలన్నారు. పాతమెట్ల మార్గాన్ని కూడా వీలైనంత మేరకు పునరుద్ధరించాలని, అటువైపు కూడా భక్తులు స్నానాలాచరించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
లింగాలగట్టు వద్ద రెండు పుష్కరఘాట్లు
రాష్ట్ర విభజన జరిగిన తరువాత లింగాలగట్టు ఎడమభాగం తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోవడంతో కుడివైపున ఉన్న లింగాలగట్టు ప్రాంతంలో రెండు ఘాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ విజయమోహన్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల వద్దకు చేరుకునే మార్గానికి అడ్డుగా మత్స్యకారుల ఇళ్లు పై భాగంలో ఉండడంతో వాటిని తొలగించాల్సిందిగా సూచించారు. దీనిపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేయగా తొలగించిన ఇళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త గృహాలు నిర్మించి ఇస్తామని తెలిపారు.