- అలంపూర్ మహా పుణ్యక్షేత్రంలో విస్తృత సౌకార్యాలు
సాక్షి,సిటీబ్యూరో
కృష్ణాపుష్కరాలను పురష్కరించుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీశైలం, అలంపూర్ పుణ్యక్షేత్రాల్లో భక్తుల ర ద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా శక్తిపీఠం, అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం ఉన్నాయి. దీంతో భక్తులు మొదటి చూపు ఆ ప్రాంతాలపై ఉంది. రెండు ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లును చేశారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. శ్రీశైలంలో మూడు పుష్కర నగర్లు, ఘాట్లతో పాటు భక్తులకు స్వామి అమ్మవారి దర్శనం, అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్‌లో దర్శనం సులువుగా కల్గేటట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు మార్గం సుగమం చేశారు.
పుష్కర నగర్లు - 1:
శ్రీశైలంలోని యజ్ఞవాటిక ప్రదేశం వద్ద పుష్కర్ నగర్ -1 ఏర్పాటు చేశారు. బస్సుల్లో ఇతర ప్రాంతాల నంచి వచ్చిన భక్తులు ఇక్కడే దిగ వలసి ఉంటుంది. ఈ ప్రదేశం నుంచే తెలంగాణ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ పుష్కర్ నగర్ వద్ద భక్తుల సౌకర్యార్థం వసతి, క్లాక్ రూం, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు.
పుష్కర్ నగర్- 2:
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక వైపు పుష్కర్ నగర్ - 2 ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో భక్తులకు వసతి ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుడ్‌స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. రుచికరమైన వివిధ రకాల వంటను నోరారా భుజించవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్‌షో భక్తులను ఆకట్టుకొనుంది. ఆ సమీపంలోనే రాష్ట్రంలోని ప్రముఖ నమునా దేవాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. యాత్రీకుల సౌకర్యార్థం ఇక్కడ క్లాక్‌రూం, దుకాణాలు అందుబాటులో తీసుకవచ్చారు. పార్కింగ్ కూ అవకాశం కల్పించారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు ఉంటాయి.
పుష్కర నగర్ - 3 :
పాతాళ గంగకు వెళ్లే మార్గంలోని కాటేజి నెం. 111 ఎదురుగా యాత్రికుల వసతి సముదాయ షెడ్లను పుష్కర్ నగర్ - 3 గా ఏర్పాటు చేశారు. ఇక్కడ అధిక సంఖ్యలో వసతి పొందటానికి సౌకర్యం సమకూర్చారు. అన్న దాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం స్నానపు గదులు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి.
పుష్కర ఘాట్లు...
శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద రోప్‌వే వైపు కొత్తగా నిర్మించిన భ్రమరాంబ పుష్కర్ ఘాట్, ఆ ప్రక్కనే మల్లికార్జున ఓల్డ్ పుష్కర ఘాట్, లింగాల గట్టు లో లెవల్, హైలెవెల్ రెండు పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్య స్నానం చేయవచ్చు.
మల్లమ్మ కన్నీరు వద్ద పార్కింగ్...
శ్రీశైలానికి వచ్చిన జీపులు, కార్లు వంటి వాహనాలను టోల్‌గేట్, యజ్ఞవాటిక, వలయమార్గం మీదుగా మల్లమ్మ కన్నీరు ఆలయానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి మళ్లిస్తారు. పుష్కర్ నగర్ -2 వద్ద వహనాలు నిలుపుకోవటానికి అవకాశం ఉంది.
అలంపూర్ గొందిమళ్ల ఘాట్...
మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం 55 పుష్కర ఘాట్‌లు ఉన్నాయి. కానీ అలంపూర్‌కు 9 కి.మీ దూరంలో గొందిమళ్ల వద్ద శ్రీజోగులాంబ అమ్మవారిగా ఘాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుక్రవారం ఉదయం 5.50 నిమిషాలకు సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానాలు చేస్తారు. అనంతరం భక్తులు స్నానాలు చేస్తారు. అమ్మవారి ఆలయానికి దగ్గరగా ఉన్న ఘాట్ ఇదే.
దర్శనం ఏర్పాట్లు...
శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు భక్తులకు ఉచిత, శ్రీఘ్ర, అతి శ్రీఘ్ర దర్శనాన్ని దేవస్థానం కల్పించింది. శ్రీఘ్ర దర్శనానికి రూ. 200, అతి శ్రీఘ్ర దర్శనానికి రూ. 1000 టిక్కెట్టు ధర నిర్ణయించారు. సిఫార్సు లేఖలు, ముఖ్య అతిధులకు అతి శ్రీఘ్ర దర్శనం టికెట్లు విక్రయించనున్నారు. వేర్వేరు చోట్ల రెండు లడ్డు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దర్శనం కోసం క్యూ లైన్లలో వచ్చే భక్తులకు ఒక లడ్డు కేంద్రం, విడిగా వచ్చిన భక్తుల కోసం మరో లడ్డు విక్రయ కేంద్రం అందుబాటులో ఉంటుంది. వైద్య, వలంటీర్ల సేవలు ఏర్పాట చేశారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వీఐపీ టికెట్ రూ. 500, సాధారణ టికెట్ రూ. 100 ధర నిర్ణయించారు.