పాతాళగంగ పుష్కరఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలమహాక్షేత్రంలో ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద రోడ్డు విస్తరణకోసం కొండచరియలను తొలచడంతో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ మార్గంలో కొండరాళ్లు హఠాత్తుగా జారిపడ్డాయి. పుష్కర పనులు నిర్వహించే సిబ్బంది ఆ సమయంలో పనుల్లోకి దిగకపోవడం, అదే సమయంలో భక్తుల రాకపోకలు కూడా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
కొండచర్యలు విరిగిపడే సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ ముందస్తుగానే తొలచిన కొండ ప్రాంతంలో ఐరన్ మెష్ ఏర్పాటు చేసి కాంకీట్ పూత పూయాల్సిందిగా గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ పని ఇప్పటి వరకు అమలు కాలేదు.
శనివారం రాత్రి కురిసిన ఒక్క భారీ వర్షానికే పై నుంచి కొండచరియలు విరిగిపడడంతో రోప్‌వే నుంచి ప్రస్తుతం వినియోగంలో ఉన్న పుష్కరఘాట్‌కు వేళ్లేరోడ్డుమార్గంలో కొండరాళ్లతో నిండిపోవడంతో ఆ ఘాట్ మూసుకుపోయింది. కొండచరియలు విరిగిపడ్డ సంఘటనను తెలుసుకున్న దేవాదాయ శాఖ కమీషనర్ అనురాధ, ఈఓ నారాయణ భరత్ గుప్త,జెఈఓ హరినాథ్‌రెడ్డిలు ఆ ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే కొండరాళ్లలను తొలగించాల్సిందిగా ఆదేశించడంతో ప్రొక్లైన్ ద్వారా వాటిని కాంట్రాక్టర్లు తొలగించిమార్గం సుగుమం చేశారు.