‘‘జిల్లాకు రూ.2కోట్ల నిధులు ఇచ్చాం. ప్రజలకు, పశువులు తాగునీటి సమస్య తలెత్తకుండా మీరు ఏం చేస్తారో ....
జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశం
మదనపల్లె రూరల్: ‘‘జిల్లాకు రూ.2కోట్ల నిధులు ఇచ్చాం. ప్రజలకు, పశువులు తాగునీటి సమస్య తలెత్తకుండా మీరు ఏం చేస్తారో తెలియదు.. నీళ్లు ఇవ్వాల్సిందే. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందని ఫిర్యాదు వస్తే ఊరుకునేది లేదు’’ అని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. స్థానిక టౌన్‌హాల్, మిషన్ కాంపౌండ్‌లోని కమ్యూనిటీ హాల్‌లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల డివిజన్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన కల్పించారు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వుంటే స్వాధీన పరుచుకోమన్నారు. అవసరమైతే రైతుల బోర్లను కూడా తీసుకుని తాగునీటి సరఫరా చేయమని ఆదేశించారు. ఈ మూడు నెలలు కొత్తబోర్లకు అనుమతించేదిలేదన్నారు. ఉన్న వాటితోనే తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నారు.
ముఖ్యంగా వేసవిలో పశువులకు గ్రాసం కొరత లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గడ్డి రూ.3 కే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సూచించారు. అనర్హులకు పింఛను చేరితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కరువులో ఉపాధి పనులను వేగవంతం చేసి వలసలు నివారించాలని సూచించారు. మండలాల వారీగా తాగునీటి సమస్య, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ గోపీచంద్, ఎంపీడీవోలు లక్ష్మీపతి, వసుంధర, ఇన్‌చార్జ్ ఎంపీడీవో సురేష్, తహశీల్దార్లు, సీడీపీవోలు సరళాదేవి, సరస్వతి, ఏపీడీ దీక్షాకుమారి, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.