సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది.
2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్‌లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్‌లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో)
కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు
విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు
కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు
విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు
అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు
ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి: 407 కోట్లు
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హైలెవల్ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు
ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు
రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment