
‘గంట’ కొట్టేశారు!
గంటలో ముగిసిన జెడ్పీ బడ్జెట్ సమావేశం
రూ.473 కోట్లతో అంచనా బడ్జెట్
తమకు నిధులు కేటాయించాలని జెడ్పీటీసీ సభ్యుల పట్టు
మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం గంటలో ముగిసిపోయింది. సభ్యులు విభాగాల వారీగా తయారు చేసిన వార్షిక బడ్జెట్ సవరణ, అంచనా ప్రతులను చదివేలోగా మాంత్రికుడి చేతిలో మాయా జాలంలా సభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించేసింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జెడ్పీ వార్షిక బడ్జెట్ సమావేశం ఏర్పాటుచేశారు. సభ్యులు రాగానే బడ్జెట్ కాపీలు వారికి అందచేశారు. అవి వారు చదివే లోగా జెడ్పీ సీఈవో ఆర్.జయప్రకాశ్ నారాయణ్ 2015-16కు సంబంధించి సవరణ బడ్జెట్, 2016-17కు సంబంధించి అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇంతలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమకు జెడ్పీ నిధులు కేటాయించాలని పట్టుపట్టారు. ఏడాదికి ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజల నుంచి గెలిచిన వారిమేనని, తమకు నిధులు కేటాయిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతామని సీఈవోను కోరారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తున్నప్పటికీ అందులో కొంత మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయిస్తే బాగుంటుందని అడిగారు.
ఏజెన్సీకి నిధులు ఏవీ: ఎమ్మెల్యే గిడ్డి
జెడ్పీ నుంచి రావాల్సిన నిధులు ఏజెన్సీకి రావడం లేదని, అసలు ఏజెన్సీలో జెడ్పీ ద్వారా ఈ ఏడాది ఎంత ఖర్చు చేశారో చెప్పాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కేటాయించిన రూ. 50 కోట్లను గ్రామీణ ప్రాంతాల ఖర్చు చేయాలని సూచించారు. రావికమతం ఎంపీపీ వినోద్‌బాబు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయించడంతో పాడైన బోరుబావులను బాగు చేయించుకోలేని దుస్థితి అని అన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు మాదిరి కేటాయించాలన్నారు.
ఆర్థిక సంఘం నిధులు వచ్చేలా కృషి
14వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మండలాలు, జిల్లా పరిషత్‌లకు కేటాయించేలా కేంద్రాన్ని కోరుతానని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఎంపీ నియోజకవర్గ నిధులు, ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులతో పాటు మిగతా ప్రభుత్వ నిధులను సమన్వయం చేసి గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చేస్తానన్నారు.
రాజకీయాలకతీతంగా నిధులు
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో జెడ్పీ నిధులతో సమానంగా పనులు చేపట్టామని, 2016-17లో కూడా అన్ని మండలాలకు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.