• యూనిఫారాల కుట్టు ఆర్డర్లలో చేతివాటం
• జతకు రూ.5 నుంచి రూ. 8 వరకు కమీషన్
• ఇవ్వని డ్వాక్రా సంఘాలకు మొండిచెయ్యి
• నిబంధనలను కాలరాస్తున్న ఎంఈవోలు
మహారాణిపేట (విశాఖ) : విద్యాలయాలను తీర్చిదిద్దాల్సినవారే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి.. బోధనపకరణాలకు అందుతున్న నిధులను బొక్కేస్తున్న కొందరు అధికారులు చివరికి విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫారాలను కుట్టడానికి ఏజెన్సీలను నిర్ణయించే విషయంలోనూ కమీషన్ల కక్కుర్తికి పాల్పడుతున్నారు. చాలా మండలాల్లో మండల విద్యాశాఖాధికారులు, ప్రధానాపాధ్యాయులు కుమ్మక్కై జతకు 5 నుంచి 8 రూపాయల వరకు కమీషన్లు దండుకుంటున్నారు. కమీషన్లు ఇవ్వని ఏజెన్సీలకు ఫ్యాబ్రిక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో 2,36,818 మంది పిల్లలున్నారు. వీరందరికీ రెండేసి జతలు చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అంటే 4,73,636 జతలు కుట్టించాల్సి ఉంది. ఒక్కో జతకు 5 నుంచి 8 రూపాయలు చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం రూ.20 లక్షల వరకు దండుకుంటున్నారని తెలుస్తోంది.
డ్వాక్రా సంఘాలపై చిన్న చూపు
డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు చివరికి ఎంఈఓలు, హెచ్‌ఎంలు కూడా ఖాతరు చేయడం లేదు. నిబంధనల మేరకు ఈ సంఘాలకు ఇవ్వాల్సిన కట్టు ఆర్డర్లను కమీషన్ యావలో పడి ఈ సంఘాలకు దక్కకుండా చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే యూనిఫారాల కుట్టు బాధ్యతను పాఠశాల యాజమాన్య కమిటీల(ఎస్‌ఎంసీ) ద్వారా స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు అప్పగించాలి. దానికి విరుద్ధంగా కమీషన్ ఇచ్చిన ఏజెన్సీలకే కుట్టుపని అప్పగిస్తూ ఎంఈవోలు డిక్లరేషన్ ఫారాలు ఇస్తున్నారు. అలాగే డబ్బులిచ్చిన ఏజెన్సీలకే వర్క్ ఆర్డర్ ఇస్తూ ఫ్యాబ్రిక్ ఇవ్వాలని ఆప్కోకు సిఫారసు చేస్తున్నారు. కమీషన్ ఇవ్వకపోతే డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టేదిలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.
ఆర్డర్ ఒకరికి...ఫ్యాబ్రిక్ ఇంకొకరికి
జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో డ్వాక్రా సంఘాలకు కుట్టు పని ఇస్తూ వర్క ఆర్డర్లు, డిక్లరేషన్లు ఇచ్చారు. వీరిలో కమీషన్ ఇచ్చిన వారికే క్లాత్ సరఫరా చేయాలని ఆప్కోకు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. మిగిలిన వారికి వర్క్ ఆర్డర్లు తప్ప క్లాత్ సరఫరా చేయకపోవడంతో వారు పనులు చేపట్టలేకపోతున్నారు. ఉదాహరణకు విశాఖ నగర పరిధిలోని చినగదిలిలో ఒక డ్వాక్రా సంఘానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ సంఘం కమీషన్ ఇవ్వకపోవడంతో ఆప్కోకు ఇవ్వాల్సిన సిఫారసు లేఖపై ఎంఈవో సంతకం చేసినా.. అందులో ఎంత క్లాత్ ఇవ్వాలన్న విషయాన్ని నమోదు చేయకుండా ఖాళీగా వదిలేశారు. ఫలితంగా క్లాత్ సరఫరా కాక ఆ ఏజెన్సీ ఇబ్బంది పడుతోంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడంలేదు. కాగా ఈ ఏజెన్సీ కమీషన్ చెల్లించకపోవడంతో దీనికి ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను మార్చి ఒక మంత్రి సన్నిహితుడికి చెందిన ఏజెన్సీకి కట్టబెట్టారని తెలిసింది. ఇదొక్కటే కాదు.. జిల్లాలోని చింతపల్లి, జి.కె.వీధి, మాడుగుల, పాడేరు, హుకుంపేట తదితర మండలాలతోపాటు పాటు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఇదే దందా సాగింది.
కీలక అధికారి అండదండలతోనే
డ్వాక్రా మహిళలకు కాకుండా ఏజెన్సీలకు కుట్టుపని దక్కేలా సర్వశిక్షా అభియాన్‌లోని ఒక కీలక అధికారి పావులు కదిపారు. కుట్టుపని దక్కాలంటే ఎంఈఓలకు కమీషన్లు ఇవ్వాలని ఆ అధికారి స్వయంగా ఏజెన్సీలకు సూచించారు. దాంతో ఏజెన్సీలు నేరుగా తమకు నచ్చిన మండలాలకు వెళ్లి కమీషన్లు సమర్పించి వర్క్ ఆర్డర్లు దక్కించుకున్నారు. కన్ని మండలాల ఎంఈవోలతో ఈ అధికారి నేరుగా మాట్లాడి తనకు అనుకూలమైన ఏజెన్సీలకు ఎక్కువమంది విద్యార్థులున్న మండలాల ఆర్డర్లు ఇప్పించినట్లు సమాచారం
కమీషన్ల కక్కుర్తి!
Published Thu, Jan 28 2016 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement