కేంద్రం నుంచి నిధులు తెండి! | cm kcr test to minister's take funding to central | Sakshi
Sakshi News home page

కేంద్రం నుంచి నిధులు తెండి!

Published Sat, Feb 11 2017 2:09 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కేంద్రం నుంచి నిధులు తెండి! - Sakshi

కేంద్రం నుంచి నిధులు తెండి!

మంత్రుల పనితీరుకు సీఎం కేసీఆర్‌ పరీక్ష
ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులపై ఒత్తిడి చేయండి
వరుసగా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మంత్రులు  


సాక్షి, హైదరాబాద్‌: మంత్రుల పనితీరుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరీక్ష పెట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, శాఖల వారీగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులు రప్పించుకునేందుకు ఎవరికివారుగా ప్రయత్నాలు చేయాలని మంత్రులను పురమాయించారు. ‘‘శాఖల వారీగా కేంద్రం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చాయి..? ఇంకా ఎంత మొత్తం రావాల్సి ఉంది.. అదనంగా నిధులు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నా యా.. అవసరమైతే వెంటనే ఢిల్లీకి వెళ్లండి. కేంద్ర మంత్రులను కలసి ఒత్తిడి చేయండి. మీ పని తీరును నిరూపించుకోండి’’ అని ఇటీవలి కేబినేట్‌ భేటీలో ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొట్టే పని పెట్టుకున్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల కేటాయింపులపై అధికారులతో సమీక్షలు నిర్వహించటంతో పాటు వరుస విజ్ఞప్తులతో కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. కేబినేట్‌ భేటీ అనంతరం గత వారం రోజుల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి.. సంబంధిత కేంద్ర మంత్రులను కలిశారు. వివిధ పథకాల కింద రావాల్సిన నిధుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)కు, బాలికా విద్యకు అదనంగా నిధులు కేటాయించాలని కడియం విజ్ఞప్తి చేయగా... కేంద్రం ఎస్‌ఎస్‌ఏకు అదనంగా రూ.147 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక పోలీస్‌ అకాడమీ తరహాలో జాతీయ స్థాయి ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని మహేందర్‌రెడ్డి కోరారు. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి, వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.

రావాల్సిన బకాయిలు రూ.1,100 కోట్లు
వివిధ శాఖలకు సంబంధించి కేంద్రం 64 కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) కింద రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తుంది. వాటికి రాష్ట్ర వాటాను జోడించి పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఎస్‌ పథకాల కింద రూ.7,800 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అందులో డిసెంబర్‌ నెలాఖరు వరకు రూ.6,700 కోట్లు విడుదల కాగా.. మరో రూ.1,100 కోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ నిధులు రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేంద్ర నిధులకు సం బంధించి లెక్కలు సరిగ్గా లేకపోవటంతో అన్ని శాఖల మంత్రులు తల పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు (యూసీలు) పంపిస్తేనే కేంద్రం తదుపరి నిధులు విడుదల చేస్తుంది. కొన్ని పథకాల్లో నిధుల వినియోగం సమర్థవంతంగా జరిగినట్లు భావిస్తే అదనపు నిధులను కూడా కేటాయిస్తుంది. కానీ రాష్ట్రం లో వ్యవసాయంతో పాటు గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, సంక్షేమ విభాగాలు ఇప్పటికీ యూసీలను పంపించలేదు.

లెక్క తేలని రూ.2,000 కోట్లు!
వివిధ పథకాలకు, శాఖలకు నిధులు విడుదల చేసే పద్ధతిని ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ సంక్లిష్టం చేసింది. దాంతో ఇచ్చిన బీఆర్‌వోలకు (బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు), వాస్తవ నిధుల కేటాయింపులకు పొంతన లేకుండా పోయింది. కేంద్ర పథకాలకు సంబంధించి ఇప్పటికే రూ.7,600 కోట్లు వివిధ శాఖలకు కేటాయించినట్లుగా ఆర్థిక శాఖ బీఆర్‌వోలు జారీ చేసింది. కానీ ఆ మేరకు నిధులను మాత్రం విడుదల చేయలేదు. నిధులకు సరి పడే చెక్కులు ఇవ్వకపోవడం, కొన్ని నిధుల ను శాఖలకు నేరుగా ఇవ్వకుండా పీడీ ఖాతా లో వేయడం, కొన్ని చెక్కులు ఇచ్చినా క్లియరెన్స్‌ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వం టివి చేసింది. మొత్తంగా ఆర్థిక శాఖ ఇచ్చిన బీఆర్‌వోలకు వాస్తవకేటాయింపులకు మధ్య దాదాపు రూ.2వేల కోట్ల వ్యత్యాసం ఉందని ఇటీవలే వివిధ శాఖలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి కూడా. కొన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన, ఇచ్చిన నిధుల వివరాలను చెప్పాలంటూ ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement