రాజన్నకు వైభోగమే!
♦ సీఎం రాకతో ఎములాడకు మహర్దశ
♦ రాబోయే కేబినెట్‌లోనే అంకురార్పణ
♦ రూ.500 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక
♦ మరో ఐదేళ్లలో రూపురేఖలే మారే అవకాశం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటనతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి బీజాలు పడ్డాయి. ఏటా రూ.100 కోట్ల చొప్పున రాబోయే నాలుగైదేళ్ల వరకు నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించడంతో రాజన్న భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాబోయే ఐదేళ్లలో ఎములాడ రూపురేఖలు మారేలా చేస్తానని ముఖ్యమంత్రే ప్రకటించడంతో ఇక ఎములాడ రాజన్న దేవాలయానికి మహర్దశ పట్టడం ఖాయమన్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సూచనలతో దేవాలయ అధికారులు రూ.250 కోట్లకే ప్రతిపాదనలు రూపొందించారు.
సీఎం ఆ మేరకు నిధులు కేటాయిస్తే చాలు. దేవాలయ పరిసర ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చనే భావనలో ఉన్నారు. కానీ, వారు ప్రతిపాదించిన దానికంటే రెట్టింపు నిధులు కేటాయించేందుకు సీఎం సిద్ధమవ డం... అందులో భాగంగా అక్కడికక్కడే రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించడం.. దీనికితోడు రాబోయే నాలుగైదేళ్ల పాటు ఏటా రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో రాజన్న ఆలయ అధికారుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే జిల్లా ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు చప్పట్ల తో సంతోషాన్ని వ్యక్త పరిచారు.
మీడియా సమావేశం ముగిసిన తరువాత ఆలయ ఈవో సహా అధికారులంతా సీఎంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ముందు 2, 3 ఎకరాల విశాల స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఆలయ ప్రాంగణ ంలో లక్షలాది మంది భక్తులుండేలా తీర్చిదిద్దుతామని, హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ తరహాలో వేములవాడ చెరువును అభివృద్ధి చేస్తామని, నాంపల్లి గుట్టను పర్యాటక కేంద్రంగా మారుస్తామని, అక్కడి నుంచి రాజన్న దేవాలయం వరకు రోడ్లు విస్తరిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో... రాబోయే ఐదేళ్లలో ఊహించలేనంతగా వేములవాడ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి రాజన్న దేవాలయానికి వచ్చి వెళితే చాలు... అని జిల్లా ప్రజలంతా భావిస్తున్న తరుణంలో... ఏకంగా రోజంతా జిల్లాలోనే మకాం వేసి రాజన్న సన్నిధిలోనే 6 గంటలకుపైగా సమయాన్ని వెచ్చించి... కాలినడక బయలుదేరి చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశీలించడంతో పేదల దేవుడిగా కొలిచే రాజన్నకు రాబోయే రోజుల్లో ఇక వైభోగం తప్పదని భావిస్తున్నారు. ఏటా వంద కోట్లు కేటాయిస్తామనే సీఎం వ్యాఖ్యలు ఆచరణ సాధ్యమా? కాదా? అనే విషయాన్ని పక్కనపెడితే... కనీసం రూ.300 కోట్లు కేటాయిస్తే చాలనని... కనీవినీ ఎరగని రీతిలో ఎములాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని, గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
నాంపల్లి గుట్టను సందర్శించిన మొట్టమొదటి సీఎం
రాజన్న ఆలయూనికి అనుబంధంగా ఉన్న నాంపల్లి గుట్టను ఓ ముఖ్యమంత్రి స్థారుు వ్యక్తి సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అధికారులతో సమీక్షలో నాంపల్లి గుట్ట గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాంపల్లి గుట్ట నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్లను వెడల్పు చేస్తామని, వెళ్లడానికి, రావడానికి చెరో రోడ్డు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుట్టపై ఉన్న 125 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
విస్తరణకు అవకాశం
మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయూనికి వెళ్లే దారి ఇరుకుగా ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్ రోడ్డు విస్తరణ కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘విస్తరణలో ఆస్తి కోల్పోయే వారికి ఎంత నష్టం వస్తుందో... అంతకంటే ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆలయ అభివృద్ధి కోసం అందరూ సహకరిం చాలి. త్వరలోనే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులంతా సమావేశమై తగిన నిర్ణయం తీసుకోవాలి. స్థానికులు కూడా సహకరించాలి. బైపాస్ రోడ్ల కోసం రూ.60 కోట్లు విడుదల చేశాం. సత్వరమే పను లు చేపట్టాలి.
ఆలయ విస్తరణలో భాగంగా చెరువు సమీపంలోని మరో 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తాం. వారికి అంతకుమించి స్థలాన్ని వేరే చోట ఇస్తాం. సిరిసిల్ల నుంచి వేములవాడకు నాలుగు లైన్ల రహదారి పనులు నడుస్తున్నారుు. వాటిని వెంటనే పూర్తి చేస్తాం. వేములవాడలోనే సంస్కృత, వేద పాఠశాల ఉండాలి. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఇక్కడ ఆయా పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. సంకెపల్లి వద్ద చెక్‌డ్యాం కట్టి మధ్యమానేరు బ్యాక్‌వాటర్ నిల్వ చేస్తే 365 రోజులపాటు నీటికి కొరత ఉండదు’ అని వేములవాడకు సీఎం వరాలు ప్రకటించారు.
చెరువు అభివృద్ధి
గుడిచెరువును అందంగా తీర్చిదిద్దుతామనీ సీఎం తెలిపారు. మూడున్నర కిలోమీటర్ల మేర రింగ్‌బండ్ లాగా తీర్చిదిద్దుతామని, మట్టి తీసి నీటిని నిల్వ చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. లక్షలాది మంది వచ్చినా స్థలం ఉండేలా చెరువు ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పుష్కరిణి కూడా భక్తులకు సరిపడేలా లేదని, విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ పనులన్నీ రాబోయే 2 నుంచి 5 ఏళ్లలోపే పూర్తి చేస్తామని చెప్పడంతో నాలుగేళ్లలో రాజన్న ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశమేర్పడింది.
మంత్రులు లేకుండానే పర్యటన
సీఎం వేములవాడ పర్యటన దేవాదాయశాఖ మంత్రి, కనీసం జిల్లా మంత్రులు లేకుండానే పర్యటన సాగడం గమనార్హం.