ఒలింపిక్‌ పతకాల వేటలో... ఖర్చు రూ. 470 కోట్లు | Huge funding for Paris Olympics preparations | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: ఒలింపిక్‌ పతకాల వేటలో... ఖర్చు రూ. 470 కోట్లు

Published Wed, Jul 17 2024 4:17 AM | Last Updated on Wed, Jul 17 2024 12:59 PM

Huge funding for Paris Olympics preparations

క్రీడాకారులకు భారత ప్రభుత్వం అండదండ   

పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాలకు భారీగా నిధులు  

రూ. 470 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం  

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో గ్రేట్‌ బ్రిటన్‌ 29 స్వర్ణాలు, 18 రజతాలు, 18 కాంస్యాలతో (మొత్తం 65 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించింది. 

వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తాము గెలిచిన ఒక్కో పతకం కోసం 45 లక్షల పౌండ్లు (సుమారు రూ.38 కోట్లు) ఖర్చు చేసినట్లు ఒలింపిక్స్‌ తర్వాత అధికారులు వెల్లడించారు. ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, టోర్నీలు వంటి సన్నాహాల్లో దీనిని ఖర్చు చేశారు. 

ఇది పుష్కరకాలం క్రితం నాటి మాట. ఇదే విషయాన్ని భారత్‌ కోణంలో చూస్తే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆటగాళ్లు వ్యక్తిగత కష్టం, పట్టుదలను నమ్ముకొనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఒలింపిక్స్‌కు చేరువైన సమయంలో అక్కడక్కడా కొంత ఆర్థిక సహకారం లభించినా... అందులో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు. 

1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క వ్యక్తిగత పతకం కూడా రాలేదు. ఆ తర్వాతి ఒలింపిక్స్‌లలో పతకం సాధించినవారు కూడా సొంతంగా సన్నద్ధమైనవారే తప్ప ఒక్కరిని కూడా వ్యవస్థ తీర్చిదిద్దినవారుగా చెప్పలేం. 

కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్‌ క్రీడలను, ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. గెలిచి వచ్చిన తర్వాత అందించే నజరానాల కంటే గెలిచేందుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం కీలకమని నమ్మింది. అందుకే మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) పేరుతో ప్రత్యేకంగా ఆర్థిక వనరులను చేకూర్చింది. 

టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం (టాప్స్‌) పథకం పేరుతో ఎంపిక చేసిన ఆటగాళ్లకు సహాయం అందించడం ఈ ఎంఓసీలోనే భాగంగా ఉంది. విదేశాల్లో శిక్షణ, పోటీల కోసం ప్రత్యేక క్యాలెండర్‌ (ఏసీటీసీ)తో ఈ ప్రణాళిక రూపొందించగా... వివిధ వర్గాల నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) ద్వారా కూడా నిధులు సేకరించింది.    – సాక్షి క్రీడా విభాగం 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ గరిష్టంగా 7 పతకాలు సాధించింది. ఇవి ముగిసిన తర్వాత పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. ఈ సారి పతకాల సంఖ్యను పెంచడమే ఏకైక లక్ష్యంగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) తమ వంతు పని చేసింది. 16 క్రీడాంశాల్లో ఆయా జాతీయ క్రీడా సమాఖ్యల సూచనలు, ప్రతిపాదనలతో ప్రణాళిక సిద్ధమైంది.

కేవలం నిధులు అందించడం మాత్రమే కాగా టోక్యో–పారిస్‌ మధ్య కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనను కూడా ‘సాయ్‌’ పర్యవేక్షిస్తూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 470 కోట్లు ఖర్చు చేసింది. మన దేశం నుంచి ఈసారి 117 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. పతకావకాశాలు ఉన్న వివిధ క్రీడలు, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు వివరాలను చూస్తే...

అథ్లెటిక్స్‌: ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్థిక సహాయం అందుకున్న క్రీడాంశం అథ్లెటిక్స్‌. ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 29 మంది పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్‌కు కేంద్రం రూ.96.08 కోట్లు ఖర్చు చేసింది. 

గత టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించడంతో ఈ సారి అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం 36 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. విదేశీ కోచ్‌ క్లాజ్‌ బార్టొనెట్‌ వద్ద శిక్షణ తీసుకోవడంతో పాటు విదేశాల్లో టోర్నీలు, శిక్షణ కోసం నీరజ్‌ చోప్రాకే ప్రభుత్వం రూ.5.72 కోట్లు ఇ చ్చింది.  

బ్యాడ్మింటన్‌: ప్రభుత్వం ఈ క్రీడ కోసం మొత్తం రూ. 72.02 కోట్లు ఖర్చు చేసింది. భారత్‌ నుంచి సింగిల్స్‌ విభాగంలో ముగ్గురు... పురుషుల, మహిళల డబుల్స్‌లో కలిపి నలుగురు షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. విదేశాల్లో శిక్షణ, టోర్నీలకు గరిష్టంగా బ్యాడ్మింటన్‌ ఆటగాళ్ల 81 ట్రిప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 

డబుల్స్‌ స్పెషలిస్ట్‌ కోచ్‌ మథియాస్‌ బో వద్ద శిక్షణ, వీడియో అనలిస్ట్, ఇతర సౌకర్యాల కోసం డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిలకు ప్రభుత్వం రూ. 5.62 కోట్లు ఇవ్వగా... పీవీ సింధుకు రూ.3.13 కోట్లు అందించింది. దీంతో పాటు 17 విదేశీ పర్యటనలు, వ్యక్తిగత కోచ్‌లు, సిబ్బంది నియామకం కోసం కూడా ‘టాప్స్‌’ ద్వారా సింధుకు సహకారం లభించింది.  

బాక్సింగ్‌: రూ.60.93 కోట్లు 

షూటింగ్‌: రూ.60.42 కోట్లు (ఆటగాళ్ల మొత్తం 45 విదేశీ ట్రిప్‌లకు ప్రభుత్వ సహకారం లభించింది. మొత్తం 41 జాతీయ క్యాంప్‌లు జరిగాయి) 

హాకీ: రూ.41.29 కోట్లు (టోక్యోలో కాంస్యం సాధించడంతో ఈ సారి మన జట్టునుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తూ 76 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించడంతో పాటు 19 విదేశీ పర్యటనలకు అవకాశం కల్పించింది)  

ఆర్చరీ: రూ.39.18 కోట్లు (41 జాతీయ క్యాంప్‌లు నిర్వహించారు) 

రెజ్లింగ్‌: రూ.37.80 కోట్లు 

వెయిట్‌లిఫ్టింగ్‌: రూ.26.98 కోట్లు (టోక్యో రజత పతక విజేత మీరాబాయి చానుకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం రూ. 2.74 కోట్లు అందించింది) 

టేబుల్‌ టెన్నిస్‌: రూ. 12.92 కోట్లు 

జూడో: రూ. 6.30 కోట్లు 

స్విమ్మింగ్‌: రూ.3.90 కోట్లు 

రోయింగ్‌: రూ.3.89 కోట్లు 

సెయిలింగ్‌: రూ.3.78 కోట్లు 

గోల్ఫ్‌: రూ.1.74 కోట్లు 

టెన్నిస్‌: రూ.1.67 కోట్లు 

ఈక్వె్రస్టియన్‌: రూ.95 లక్షలు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement