స్థిరమైన నిధులతోనే శాస్త్రీయ ప్రగతి | Scientific progress with constant funding details | Sakshi
Sakshi News home page

స్థిరమైన నిధులతోనే శాస్త్రీయ ప్రగతి

Published Sat, Jun 3 2023 1:56 AM | Last Updated on Sat, Jun 3 2023 1:57 AM

Scientific progress with constant funding details - Sakshi

సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. కోవిడ్‌-19 టీకా, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్‌ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశాబ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. 

హింగోలి మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని జిల్లా కేంద్రం. 1948 వరకూ హైదరాబాద్‌ నిజాం రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మిలిటరీ కేంద్రంగానూ వాడుకునేవారు. తాజాగా ఈ జిల్లాకు సరికొత్త గుర్తింపు లభిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టు ‘లేజర్‌ ఇంటెర్‌ ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌ వేవ్‌ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’కు కేంద్రంగా ఇది అవతరించనుంది. ఈ మహా భౌతిక శాస్త్ర ప్రయోగ శాల కాస్మిక్‌ గ్రావిటేషనల్‌ వేవ్స్‌ను గుర్తించేందుకు ఉద్దేశించింది. ఇలాంటివే అమెరికాలోని హాన్ఫర్డ్, లివింగ్‌స్టోన్  ప్రాంతాల్లో ఉన్నాయి. మరోరెండు ఇటలీ, జపాన్లలో ఉన్నాయి. 2030 నాటికి హింగోలి లోనూ ఈ వేధశాల నిర్మాణం పూర్తయితే ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌
సంపూర్ణమవుతుంది. 

నాలుగు కిలోమీటర్ల పొడవైన భుజాల్లాంటి నిర్మాణాలు... ఎల్‌ ఆకారంలోని ఇంటర్‌ఫెరోమీటర్‌లతో కూడిన ఈ ప్రయోగశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదా¯Œ లో నేషనల్‌ టెక్నాలజీ డే సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆన్‌లైన్‌లో రూ.1,200 కోట్ల విలువైన హింగోలి లిగో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మ కమైన ఈ ప్రాజెక్టును భారత్‌ చేపట్టడం హర్షణీయమైన విషయమై నప్పటికీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు, మౌలిక శాస్త్ర పరిశోధనల విషయంలో భారత్‌ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని సమీక్షించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది.

ఎంత ‘వేగం’గా సాగుతున్నాయంటే...
లిగో ప్రాజెక్టు ఆలోచనలకు బీజం పడ్డది 2009 లోనే. భారతీయ శాస్త్ర పరిశోధన సంస్థలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కలిసికట్టుగా గ్రావిటేషనల్‌ వేవ్స్‌పై పరిశోధనలు చేస్తూండేవారు. ఆ క్రమంలోనే భారత్‌లో గ్రావిటేషనల్‌ వేవ్స్‌ వేధశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టింది. రెండేళ్ల తరువాత అమెరికాలోని లిగో పరిశోధనశాల తమ పరిశోధనల్లో భాగం కావాలని భారత శాస్త్రవేత్తలకు ఆహ్వానం పలికింది. ఆ ఏడాదే భారత శాస్త్రవేత్తలు విస్తృత చర్చల తరువాత ఇండియన్ లిగో ఏర్పాటుకు సంబంధించి, భారత అణుశక్తి విభాగానికి ఒక ప్రతిపాదన చేశారు. 2012లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పచ్చజెండా ఊపుతూ ఓ కమిటీ నిధులు కేటాయించాల్సిందిగా అభ్యర్థించింది. నాలుగేళ్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చక్కర్లు కొట్టిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి 2016లో ‘సూత్రప్రాయ అంగీకారం’ తెలిపింది. 

ఆ తరువాత సుమారు ఏడేళ్ల నిరీక్షణ తరువాత ఈ ప్రాజె క్టుకు తుది అనుమతులు లభించాయి. దేశంలో సైన్స్ ప్రాజెక్టులు ఎంత ‘వేగంగా’ అమలవుతాయో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలు. హింగోలి ప్రాజెక్టు అమల్లో జరిగిన జాప్యం ఇంకో విషయాన్నీ గుర్తు చేస్తుంది. దేశంలో పరిశోధనల కోసం కేటాయిస్తున్న నిధుల్లో పెరుగుదల లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తిలో పరిశోధనలకు (ఆర్‌ అండ్‌ డీ) కేటాయించిన నిధులు దశాబ్ద కాలంగా కేవలం 0.7 శాతం మాత్రమేనని నీతి ఆయోగ్‌ గత ఏడాది విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఈ మోతాదు బ్రెజిల్‌ (1.6 శాతం), దక్షిణాఫ్రికా (0.83) కంటే తక్కువ కావడం గమనార్హం. పొరుగు దేశం చైనా తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 2.14 శాతం ‘ఆర్‌ అండ్‌ డీ’కి కేటాయిస్తోంది. కేటాయింపులు అత్యల్పంగా ఉంటే పరిశోధనా రంగంలో పురోగతి సాధ్యం కాదని నీతి ఆయోగ్‌ తన నివేదికలో విస్పష్టంగా తెలిపింది. 

లక్ష్యాలూ అస్పష్టమే...
2013లో భారత్‌ తన ‘ద సైన్స్ టెక్నాలజీ అండ్‌ ఇన్నొవేషన్’ పాలసీలో 2020 నాటికల్లా శాస్త్ర పరిశోధనల రంగంలో టాప్‌–5లోకి చేరాలని సంకల్పం చెప్పుకొంది. తొమ్మిదేళ్ల తరువాత ఇదే పాలసీని ఆధునికీకరించారు. 2030 నాటికి నాణ్యమైన పరిశోధన ఫలితాలు సాధించే టాప్‌–5 దేశాల్లోకి భారత్‌ చేరాలన్న అస్పష్ట లక్ష్యం గురించి ఈ విధానంలో పేర్కొన్నారు. పదాలతో గారడీ చేయడం కంటే పరిశోధనలకు స్థిరంగా నిధులు కేటాయించడం మేలన్న విషయం మన విధాన నిర్ణేతలకు అర్థం కావడం లేదు. ఇటీవలి కాలంలో కోవిడ్‌–19 టీకా తయారీలో సాధించిన విజయం, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్‌ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకే తిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. 

ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే అన్నది విస్మరించరాదు. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశా బ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. కోవిడ్‌ టీకా, జెనెరిక్‌ మందుల అభివృద్ధినే తీసుకుందాం. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), ఇండియన్  కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలాకాలం క్రితమే మందులు, టీకాల తయారీ, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అవస రమైన అన్ని ఏర్పాట్లూ చేశాయి. ఈ ఏర్పాట్లు 1970 నుంచి ప్రైవేట్‌ రంగం ఎదుగుదలకు పునాదిగా నిలిచాయి.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ వంటివి భారత్‌ బయోటెక్, శాంతా బయోటెక్‌ వంటి సంస్థలకు తొలినాళ్ల నుంచి అండదండగా నిలిచాయి. ప్రైవేట్‌ రంగంలోని టీకా తయారీ కంపెనీలకు వందల కోట్ల నిధులు అందించారు కూడా. సుమారు 30 – 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు కోవిడ్‌ మహమ్మారి దాడి చేసిన వెంటనే అక్కరకు వచ్చాయి. ఐటీ రంగానికీ ఇది వర్తిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్, గణిత, భౌతిక శాస్త్రాల్లో పరిశోధ నల ఫలితంగానే ఐటీ రంగం వృద్ధి చెందింది. అల్గారిథమ్స్, ఆర్టిఫీషి యల్‌ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ నెట్‌వర్కింగ్‌ రంగాల్లో జరిగిన మౌలిక పరిశోధనలే కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల అభివృద్ధికి కారణ మయ్యాయి. భారతీయ విద్యాసంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యా బోధనకు దేశం చాలా ముందుగానే పెట్టుబడులు పెట్టింది. రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు (నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలని ఇప్పుడు పిలుస్తున్నారు), తరువాతి కాలంలో ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. 

ప్రభుత్వ రంగంలో పెట్టిన ఈ పెట్టు బడుల ఫలితాలను ప్రైవేట్‌ రంగమూ పొందింది. ఆ క్రమంలోనే సరి కొత్త డిజిటల్‌ అప్లికేషన్ల అభివృద్ధికి దారితీసింది. ప్రస్తుత డిజిటల్‌ విప్లవం వెనుక ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్, సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్  సిస్టమ్స్, నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌లు అభివృద్ధి చేసిన ఈ–గవర్నెన్స్, ఇతర డిజిటల్‌ అప్లికేషన్ల భూమికను విస్మరించలేము.

సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్‌ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. దిగుమతి చేసుకున్న హార్ట్‌వేర్, విజ్ఞానంతో టెక్నలాజి కల్‌ అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల మనం ఇతరులపై ఆధారపడే స్థితి వస్తుంది. మౌలిక రంగ పరిశోధలు ఎన్నో రకాల ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. పారిశ్రామిక, సామాజిక లాభాలూ ఒన గూరుతాయి. సర్వవ్యాప్తమైన డిజిటల్‌ కెమెరా, మెడికల్‌ ఇమేజింగ్, ఇంటర్నెట్‌లన్నీ ఇందుకు ఉదాహరణలు. వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి అతి సంక్లిష్టమైన ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారానికీ మౌలిక పరిశోధనలే ఆధారం. రేపటి తరం టెక్నాలజీల కోసం ఈ రోజే సైన్స్ పై పెట్టుబడులు పెట్టడం అవశ్యం.


దినేశ్.సి శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement