అమెరికా తీరుపై చైనా గుర్రు | sakshi guest column china serious on usa | Sakshi
Sakshi News home page

అమెరికా తీరుపై చైనా గుర్రు

Published Thu, Aug 31 2023 12:41 AM | Last Updated on Thu, Aug 31 2023 4:05 AM

sakshi guest column china serious on usa - Sakshi

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల నేపథ్యంలో అమెరికా తీరుపై చైనా ఆగస్ట్‌ 18న ఒక నివేదిక విడుదల చేసింది. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలహీనపరిచే అమెరికా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల లబ్ధి పొందిన అమెరికా, తన దేశీయ సమస్యలకు (వాణిజ్య లోటు, నిరుద్యోగానికి) ప్రపంచ వాణిజ్యం కారణమంటూ, 2017 నుంచి కొత్త అప్పిలేట్‌ బాడీ సభ్యుల నియామకాలను నిలిపివేసింది. అయితే, అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనా ఇతర దేశాల పట్ల తన చర్యల గురించి సమీక్షించలేదు. ఏమైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ, దాని చుట్టూ ముసురుకుంటున్న సమస్యల మీద ఇటువంటి నివేదికను భారత ప్రభుత్వం కూడా రూపొందించి ప్రజలకు నివేదిస్తే బాగుంటుంది.

1990 నుంచి భారత ప్రభుత్వాలు ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో పాటు రెండు ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేశాయి. అందులో వ్యవసాయం మీద చేసిన ఒప్పందం కీలకమైనది. ఆనాటి నుంచి కూడా భారతదేశం అనేక రంగాలను అంతర్జాతీయ వాణిజ్యంతో ముడిపెడుతూ వస్తు న్నది. దానికి అనుగుణంగా అనేక రంగాలలో విధానాలు మార్పు చేశారు. ఈ మార్పుల వెనుక అమెరికా ఒత్తిడి ఉన్నది. అయితే, ఇటీవలి కాలంలో అనూహ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాభవం తగ్గుతూ వస్తున్నది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు, చర్చలకు ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే, ప్రపంచ వాణిజ్య సంస్థ తన ప్రయోజనాలకు అనువుగా లేదని అమెరికా భావించింది.

ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ – డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం అమెరికా తన బాధ్యతలను నెరవేరుస్తున్న తీరు పైన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మొన్న ఆగస్ట్‌ 18 నాడు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ 65 పేజీల నివేదికలో దాదాపు 210 డాక్యుమెంట్లను ఉటంకిస్తూ, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలహీనపరిచే అమెరికా విధాన చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఏకపక్ష వాణిజ్య బెదిరింపులను, పారిశ్రామిక విధా నాలలో ద్వంద్వ ప్రమాణాలను, ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలు సులకు విఘాతం కలిగించే అంశాలను ప్రస్తావించింది. వివాద పరిష్కార సంస్థ తీర్పులు, సిఫార్సులను ఇష్టానుసారం అమలు చేయడం ద్వార డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగాన్ని అమెరికా బలహీనపరిచిందని ఈ నివేదిక ఎత్తిచూపింది. 

157 వాణిజ్య వివాదాలలో అమెరికా ప్రతివాదిగా ఉందనీ, మొత్తం వాణిజ్య వివాదాలలో ఇది సుమారు 20 శాతం అనీ నివేదిక తెలిపింది. సంస్థాగత సమస్యల కారణంగా 2017 నుంచి కొత్త అప్పీలేట్‌ బాడీ సభ్యుల నియామకాలను అమెరికా నిలిపివేసిందనీ, ఈ చర్య వల్ల అప్పిలేట్‌ బాడీ ‘నిరర్థక’ పరిస్థితికి చేరుకున్నదనీ పేర్కొంది.పారిశ్రామిక విధానాలకు సంబంధించి అమెరికా ఇతర సభ్యదేశాల మధ్య వేర్వేరు ప్రమాణాలను వర్తింపజేసిందని నివేదిక తెలిపింది. అధిక సుంకాలు విధించడం లేదా వాణిజ్య–నియంత్రణ చర్యలు తీసుకోవడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి భారీ సబ్సిడీలను అందించడం, పారిశ్రామిక మరియు సరఫరా గొలుసు లను విచ్ఛిన్నం చేయడం వంటి వివిధ రక్షణాత్మక పద్ధతులను అమె రికా అవలంబించిందని ఆరోపించింది. 

డబ్ల్యూటీవో నిర్దేశిస్తున్న వాణిజ్యం వల్ల ప్రధానంగా అమెరికా లబ్ధి పొందింది. అయితే పటిష్టమైన అంతర్గత ప్రయోజన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వలన, దేశ ఆదాయం, ఉపాధిని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం వల్ల అమెరికాలో వివిధ వర్గాల మధ్య అసమానతలు పెరిగిపోయాయని చైనా నివేదిక అంటున్నది. ఒక దేశంగా తక్కువ పొదుపు, అధిక వినియోగం, అధిక రుణం ఉన్న పరిస్థితులలో, అమెరికాలో పొదుపు నిలువలు లేకపోవడం వలన ఆర్థికాభివృద్ధికి కరెంట్‌ ఖాతా లోటులు, వాణిజ్య లోటులపై ఆధార పడవలసి వస్తున్నది. అమెరికా ప్రభుత్వం తన దేశీయ సామాజిక సమస్యలను (వాణిజ్య లోటు, నిరుద్యోగానికి) ప్రపంచ వాణిజ్యం కారణమంటున్నది. దేశీయ విధాన వైఫల్యాలకు ప్రపంచీకరణను, ప్రపంచ వాణిజ్య సంస్థను కారణాలుగా చూపెడుతున్నది. 

అమెరికా ద్వంద్వ వైఖరిని చైనా నివేదిక ఎత్తి చూపెడుతున్నది. ఒకప్పుడు ఆ దేశానికి ప్రయోజనకారిగా ఉన్న కారణాలు ఈ రోజు కంటగింపుగా మారినాయి. ఇంకొకవైపు, భారత్, మెక్సికో తది తర దేశాల మీద తన ఉత్పత్తులను రుద్దే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలను ఆయుధంగా వాడుతున్నది.ప్రపంచ వాణిజ్య సంస్థలో వివాద పరిష్కార వేదిక, ఈ వేదిక పనికి ఆమోదించిన పద్ధతి కీలకం. దీని సిఫార్సులు, తీర్పులు వాణిజ్యం సమతుల్యంగా, వివాదరహితంగా కొనసాగడానికి ఉపయో గపడుతున్నాయి. అన్ని తీర్పులు ఆమోదయోగ్యం కాకపోయినా, ఒక ప్రజాస్వామ్య బద్ధ వేదిక ఉండడం ముదావహం. అయితే, 2017 నుంచి అప్పిలేట్‌ బాడీ నిబంధనల ప్రకారం, సభ్యుల గడువు ముగిసింది. ఖాళీలు ఏర్పడ్డాయి. 

అనూహ్యంగా, సంస్థాగత సమస్య లను ప్రస్తావిస్తూ అమెరికా కొత్త సభ్యుల నియామకాల ప్రక్రియను నిలిపివేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే ఉంటాయి. అమెరికా మొండి వైఖరితో కొత్త అప్పీలేట్‌ బాడీ ఏర్పడక వివాద పరిష్కార యంత్రాంగం పని చేయలేని పరిస్థితికి చేరుకున్నది. కొత్త సభ్యులతో వివాద పరిష్కార సంస్థ (డిస్ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ బాడీ) ఏర్పాటుకు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతిపా దనలను డిసెంబర్‌ 2022 నాటికి అమెరికా దాదాపు 60 సార్లు తిరస్కరించింది. డబ్ల్యూటీవో సభ్యదేశాలలో భారత్‌ సహా అత్యధికం దీనిని త్వరగా పునఃప్రారంభించడాన్ని సమర్థిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ తన సభ్యులు, ఇతరులపై అనుమతి లేని ఏకపక్ష చర్యలు తీసుకోవడాన్ని నిషేధిస్తుంది. 

కానీ, అమెరికాకు జాతీయ భద్రత, మానవ హక్కులు, బలవంతపు సాంకేతిక బదిలీ పేరుతో ఇతర సభ్యులపై ఏకపక్ష చర్యలు ప్రకటించిన సుదీర్ఘ చరిత్ర దానికి ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో, సాంకేతిక పరిజ్ఞానంలో తనకున్న ఆధిపత్య జ్ఞానాన్ని ఉపయోగించి, తన దౌత్య విధానాలు మరియు చట్టవిరుద్ధమైన డిమాండ్లను ఇతర దేశాలు, ప్రాంతీయ వాణిజ్య సమూహాలు, సంస్థల మీద కూడా రుద్దింది. ఈ పద్ధతులు అంతర్జాతీయ వాణిజ్యంపై దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ నివేదికలో చైనా 4 చోట్ల భారత్‌ ప్రస్తావన తీసుకువచ్చింది. 1997లో అమెరికాలో ఒక వ్యవసాయ సంస్థ బాస్మతి బియ్యాన్ని అమెరికన్‌ లాంగ్‌ ఇండికా బియ్యంతో సంకరించిన తరువాత 20 పేటెంట్ల కోసం మేధా హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నది. 

ఇది భారతదేశం నుండి బాస్మతి బియ్యం ఎగుమతిని తీవ్రంగా పరిమితం చేసిందని వ్యాఖ్యానించింది. ఫిబ్రవరిలో 2019లో చైనా, భారత్, దక్షిణాఫ్రికా, వెనిజులా, లావోస్‌ పీడీఆర్, బొలీవియా, కెన్యా,సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్, పాకిస్తాన్, క్యూబా సంయుక్తంగా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఒక విశ్లేషణాత్మక పత్రం సమర్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉండే వివక్షను ఎండగడుతూ, ఆయా దేశా లకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల పరిరక్షణకు హక్కులను కల్పించాల్సిన అవసరాన్ని ఈ పత్రం ద్వారా కోరాయి. అదే సంవత్సరం (2019) అక్టోబర్‌ నెలలో,  53 సభ్యదేశాలు (చైనా, భారత్, పాకిస్తాన్, ఆఫ్రికన్‌ గ్రూప్‌ సహా) సంయుక్తంగా ఒక పత్రం సమర్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక, భిన్నమైన వాణిజ్య నిబంధనలను రూపొందించడం తమ హక్కుగా ఈ పత్రంలో వర్ణించారు.

ఈ నివేదిక ద్వారా డబ్ల్యూటీవో సభ్యత్వ దేశాలతో కలిసి పని చేస్తామని చైనా హామీ ఇచ్చింది. చైనా ఇస్తున్న ఈ హామీలు ప్రపంచీ కరణ, ఆర్థిక సరళీకృత విధానాలను వ్యతిరేకించేవారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కమ్యూనిస్ట్‌ దేశంగా ముద్ర పడిన చైనా సరళీకృత ఆర్థిక విధానాలకు, ప్రపంచీకరణకు, ప్రైవేటీకరణకు ఆలవాలమైన ప్రపంచ వాణిజ్య సంస్థ కొనసాగింపునకు ఈ విధంగా ఊతం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించకమానదు. అయితే, అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనా ఇతర దేశాల పట్ల తన చర్యల గురించి సమీక్షించలేదు. కనీసం ప్రస్తావించలేదు. ఏది ఏమైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ, దాని చుట్టూ ముసురుకుంటున్న సమస్యల మీద ఇటువంటి సవివరమైన నివేదికను భారత ప్రభుత్వం కూడా తయారు చేసి, ప్రత్యేకంగా అమెరికా, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ళ గురించి ప్రజలకు, పార్లమెంటుకు నివేదిస్తే బాగుంటుంది.


- దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకులు 
90102 05742

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement