పీఎంకేఎస్వై ప్రతిపాదనలు సిద్ధం చేయండి
♦ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
♦ వాటిని నెలాఖరుకు కేంద్రానికి పంపాలని సూచన
♦ 11 ప్రాజెక్టులపై 4 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనున్న రాష్ట్రంలోని 11 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను ఈ నెలాఖరుకు కేంద్రానికి పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కేంద్ర జల సంఘం ప్రాంతీయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం ఆయన పీఎంకేఎస్‌వై పథకం పనులపై జలసౌధ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర జల సంఘం సీఈ గుప్తా, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, సాగునీటి శాఖ ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే, వివిధ జిల్లాల సీఈలు పాల్గొన్నారు.
గతంలో దేవాదుల ప్రాజెక్టు మాత్రమే పీఎంకేఎస్‌వై పరిధిలో ఉండగా, తాను కేంద్ర జల సమన్వయ కమిటీ సభ్యుడిగా కొమురంభీం, గొల్లవాగు, రాలివాగు, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు, పాలెంవాగు, ఎస్సారెస్పీ రెండో దశ, భీమా, వరద కాల్వలను సైతం ఈ పథకంలో చేర్పించానని మంత్రి గుర్తు చేశారు. ఇందులో ముందుగా వరదకాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ రెండో దశ, భీమా, పాలెంవాగు ప్రాజెక్టులకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు మూడు రోజుల్లో కేంద్ర జల సంఘానికి నివేదికలు సమర్పించాలని కోరారు.
ఈ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టులను 2017 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మధ్యతరహా ప్రాజెక్టులను కేంద్ర జల సంఘం ఇంజనీర్లు, ఆయా ప్రాజెక్టుల సీఈలు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నాలుగు రోజుల్లో కేంద్రానికి నివేదించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి మరో వెయ్యి ఎకరాల భూసేకరణ చేయాల్సిన అంశంపై సమీక్ష సమావేశం నుంచే మంత్రి హరీశ్‌రావు వరంగల్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సత్వరం భూసేకరణ జరపాలని కలెక్టర్‌కు సూచించారు.