మెడపై మిత్తి!
వడ్డీ బకాయిల కోసం మహిళల ఎదురుచూపులు
రెండేళ్లుగా విడుదలకాని నిధులు
నెలనెలా బ్యాంకుల్లో చెల్లిస్తున్నఎస్‌హెచ్‌జీల సభ్యులు
హన్మకొండ : వడ్డీ లేని రుణాల పథకం ప్రారంభించిన వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసి ఉమ్మడి రాష్ట్రంలోని మహిళలకు పెద్దన్నగా నిలిచారు. అయితే, ప్రస్తుతం రుణాలకు సంబంధించి వడ్డీ నిధులను రెండేళ్లుగా విడుదల చేయని ప్రభుత్వం మహిళలకు ఎదురుచూపులు మిగిలేలా చేస్తోంది. స్త్రీ నిధి కింద రుణాలు తీసుకునే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు.. ప్రభుత్వం వడ్డీ నిధులు విడుదల చేస్తుందన్న ఆశతో నెలనెలా బ్యాంకుల్లో అసలుతో పాటు కిస్తీల రూపంలో కడుతున్నారు. కానీ రెండేళ్లుగా వడ్డీ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వారి ఆశలు అలాగే మిగిలిపోతున్నాయి.
ఎదురుచూపులే..
వరంగల్ రూరల్ జిల్లాలోనే మొత్తం 15మండలాల్లో 10,529 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 1,27,345 మంది సభ్యులు ఉండగా స్త్రీ నిధి రుణాలు తీసుకున్నారు. అయితే, రుణాలకు సంబంధించి జనరల్, బీసీ సంఘాలకు సంబంధించి 2015 జనవరి నుంచి అంటే ఇప్పటి వరకు 24నెలలుగా అసలుతో పాటు నెలనెలా వడ్డీని కిస్తీల రూపంలో బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత వడ్డీ డబ్బులు ప్రభుత్వం ఇప్పటివరకు సంఘాల ఖాతాల్లో జమ చేయలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ సంఘాలకు సంబంధించి 2015 జూన్ నుంచి అంటే గత 18 నెలల పాటు వడ్డీ వారి ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయలేదు. ఇవన్నీ కలిపి రూ.7,22,093 వరకు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం నెలనెలా విడుదల చేయకపోవడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎదురుచూపులే మిగిలాయి.
నీరుగారుతున్న లక్ష్యం
మహిళలు ఆర్థికంగా> స్వావలంబన సాధించాలన్న ఆలోచనతో వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నారు. కానీ ప్రభుత్వం వడ్డీ నిధులు సక్రమంగా జమ చేయకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే పరిస్థితి ఎదురవుతోంది. అసలు వడ్డీ బకాయి డబ్బులు వస్తాయా, వస్తే ఎంతమేరకు వస్తాయి, అవి ఎంతకాలానికి వస్తాయనే విషయమై స్వయం సహాయక మహిళల్లో గందరగోళం నెలకొంది.