
తెలంగాణకు భారీగా నిధులు
• పలు కార్యక్రమాల కోసం రూ.5,921 కోట్లు: దత్తాత్రేయ
• కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మరో 29 వేల కోట్లు అందుతాయి
• రైల్వే బడ్జెట్‌లో రూ.1,729 కోట్లు కేటాయించామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘నోట్ల రద్దు ద్వారా ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం 34.85 శాతం పెరిగింది. నోట్ల రద్దు ప్రభావంతో నల్లధనం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి రాబడి పెరిగింది. ఈ నిధులను ప్రజల సంక్షేమానికి విరివిగా ఖర్చు చేస్తాం..’’అని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
యూపీఏ ప్రభుత్వ అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాలను చక్క దిద్దేందుకే తమకు రెండున్నరేళ్లు పట్టిందని, పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలోకి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయ కత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి విప్లవాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. గ్రామీ ణ ప్రజలు, వ్యవసాయా భివృద్ధే లక్ష్యంగా ఇది రూపొందిందని దత్తా త్రేయ చెప్పారు. విద్య, వైద్యం, సంక్షేమా నికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, తొలిసారిగా ఒకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరుణ్ జైట్లీ చరిత్రలో నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రయోజనం
తాజా బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.5,921 కోట్లు ఇచ్చామని దత్తాత్రేయ తెలిపారు. ‘‘అందులో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లోని 25 లక్షల మందికి ప్రయోజనం కలిగేలా, 25 వేల గ్రామాల్లో పలు కార్యక్రమాల నిమిత్తం రూ.1,600 కోట్లు కేటాయించాం. ఉపాధి కల్పన, శిక్షణ కోసం రూ.2,145 కోట్లు, పరిశోధనా కేంద్రంగా పేరొందిన హైదరాబాద్‌కు రూ.284 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు 162 కోట్లు కేటాయించాం. ఇవేకాకుండా 30 కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద రూ.29 వేల కోట్లు వస్తాయి.
రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.1,729 కోట్లు ఇచ్చాం..’’అని వెల్లడించారు. తెలంగాణలో 5 లక్షల మంది నిర్మాణ కార్మికులకు శిక్షణ ఇస్తామని, దాంతో వారికి మంచి వేతనాలు వస్తాయని, గల్ఫ్ దేశాల్లోనూ ఉపాధి అవకా శాలు కల్పిస్తామని దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నా యని.. బడ్జెట్‌ను కనీసం చదవకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బడ్జెట్‌పై ఏ వర్గం నుంచి కూడా వ్యతిరేకత రాలేదని, మీడియాలో సైతం అనుకూల కథనాలే వచ్చాయని స్పష్టం చేశారు.