మనకే అధిక నిధులు
♦ ప్రభుత్వం నుంచి జిల్లాకే కేటాయింపులు ఎక్కువ
♦ రోడ్లు, పంచాయతీరాజ్ పనులకు రూ.2,200 కోట్లు
♦ విలేకరుల సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు జిల్లాకే దక్కుతున్నాయని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌లో ఎక్కువ నిధులు జిల్లాకే వచ్చాయని, ఈసారి కూడా అదేస్థాయిలో రాబట్టి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులు, భవనాల విభాగానికి ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించగా.. అందులో రూ.1,400కోట్లు జిల్లాకే కేటాయించిందని, పంచాయతీరాజ్ విభాగానికి రూ.5వేల కోట్లు కేటాయించగా.. అందులో రూ.800 కోట్లు జిల్లాకు మంజూరు చేసిందన్నారు. అన్ని విభాగాల్లోనూ జిల్లాకు ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానన్నారు.
బీజాపూర్ -హైదరాబాద్ రహదారికి జాతీయ గుర్తింపు రావడంలో ప్రభుత్వ కృషి ఎంతో ఉందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలుమార్లు ఈ అంశంపై ఒత్తిడి తేవడంతో ప్రతిఫలం దక్కిందన్నారు. దాదాపు రూ.1,300 కోట్లతో ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వివరించారు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం కలగనుందని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని, పశ్చిమ ప్రాంతానికి సాగునీరందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నారు. డిండి ప్రాజెక్టు నుంచి కూడా జిల్లాలోని తూర్పు ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించనున్నట్లు ఆయన వివరించారు. గతేడాది డబుల్ బెడ్‌రూమ్ స్కీం కింద ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించగా.. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయనుందన్నారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్, తహసీల్దార్ స్థాయిలో జరుగుతుందని.. పంపిణీ ప్రక్రియ మాత్రం శాసన సభ్యుల చేతిమీదుగా సాగుతుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని, మొదటి జిల్లాగా వికారాబాద్ అవతరించడం ఖాయమన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో వికారాబాద్ జిల్లా.. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు కానుందన్నారు. జిల్లాకు బహుళ జాతీయ సంస్థల రాకతో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, ఇటీవల ప్రారంభించిన మైక్రోమ్యాక్స్, వండర్‌లా కంపెనీల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి వివరించారు. జీఓ 111 సడలింపుపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, త్వరలో ఆ ప్రాంత వాసులు శుభవార్త వింటారని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.