సాటి మనిషికి సాయమంటే ముందుండేవాడు. ఆపదవచ్చిందంటే ఆసరా అందించేందుకు వెనుకాడనివాడు.దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల సమయంలో రక్తమోడుతున్న బాధితులను ఆసుపత్రులకు తరలించినవాడు. అలాంటి మంచికుర్రాడికి విధి పరీక్ష పెట్టింది. అనారోగ్యాన్ని అంటగట్టింది. నీకెవరు సాయమొస్తారో చూస్తానంటోంది. కొన్ని నెలలుగా మంచానికి పరిమితమైన ఆ కుర్రాడి వైద్య ఖర్చుల నిమిత్తం అంతర్జాతీయ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ‘ఇంపాక్ట్ గురు’ విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుడు అతనొక్కడే కాదు... అతని లాంటి మరెందరికో ఇలాంటి సంస్థల ద్వారా చేయూతఅందుతోంది.
సాక్షి, సిటీబ్యూరో :2013లో హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సమయంలో ఇమ్మాన్యుయేల్ స్వచ్ఛందంగా బాధితులను అంబులెన్స్‌లో తరలించడంలో చురుకైన సేవలందించాడు. అక్కడ విరిగిన ఎముకలు, శరీర భాగాలున్నా అతనేమాత్రం సంశయించలేదు. ‘మొదటి నుంచీ మా అబ్బాయిది కష్టంలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం’ అని చెప్పారు శామ్యూల్. ఆయన ఓ చర్చి పాస్టర్. ప్రస్తుతం ఈయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుల్లియన్ బార్రె సిండ్రోమ్ (జీబీఎస్) అనే ఓ అరుదైన న్యూరాలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పటి వర కు ‘ఇంపాక్ట్ గురు’ దాతలందించిన సాయంతో రూ.8లక్షలకు పైగానే అందించింది. ‘రోజుకి దాదాపు రూ.లక్ష వ్యయమవుతోంది. దీనికి ఇంపాక్ట్ గురు అందిస్తున్న సహకారం కొంతమేర ఆసరా అవుతోంద’ని చెప్పారు శామ్యూల్.
ఏమిటీ క్రౌడ్ ఫండింగ్?
దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి కొన్ని ప్రభుత్వ పథకాలున్నాయి. అలాగే ధనవంతులకు వ్యయాన్ని భరించే స్థోమత ఉండొచ్చు. ఈ రెండింటికీ చెందని మధ్య, దిగువ మధ్యతరగతి వారికి మాత్రం తీవ్రమైన వ్యాధులు వస్తే ఆ కుటుంబం మొత్తానికి అది జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఎన్‌జీఓలు, చారిటీ సంస్థల విరాళాల సేకరణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) సంప్రదింపులు నెలల తరబడి సాగే ప్రయాసభరిత వ్యవహారం. ఇంత చేసినప్పటికీ వచ్చేవి అరకొర నిధులే అయి ఉంటాయి. ఇవి బాధితుల అన్ని రకాల అవసరాలను తీర్చేవిగా ఉండవు. ఈ పరిస్థితుల్లోనే అందుబాటులోకి వచ్చింది ఆన్‌లైన్ ఆధారంగా కొన్ని సంస్థలు సాగించే నిధుల సేకరణ ‘క్రౌడ్ ఫండింగ్’. ఈ ఫండింగ్‌కు కేవలం స్నేహితులు, వారి బంధువులు, సహోద్యోగుల నుంచి మాత్రమే కాకుండా అపరిచితుల నుంచి కూడా సాయం అందుతోంది.
ఆసుపత్రులతో అనుసంధానం...
రెండు మూడేళ్లుగా మన దేశంలో క్రౌడ్ ఫండింగ్ వేదికలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రులతో అనుసంధానమవుతున్నాయి. తద్వారా అవసరార్థులను గుర్తించి సాయాన్ని అందించగలుగుతున్నాయి. అయితే క్రౌడ్ ఫండింగ్ సంస్థలు చెబతున్న ప్రకారం దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైన, మందులు వాడాల్సిన వాటితో పోలిస్తే... అవయవాల మార్పిడి లాంటి అత్యవసర చికిత్సలకు దాతల స్పందన ఎక్కువగా ఉంటోంది. అదే విధంగా 0–17 ఏళ్ల లోపు ఉన్న వారికి వచ్చే లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ వంటి శస్త్ర చికిత్స సందర్భాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది.
దుర్వినియోగానికీ ఆస్కారం..
ఈ సంస్థలకు సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా ప్రజలకు చేరకముందే వీటి చేయూతను దుర్వినియోగం చేస్తున్నవారు కూడా ఉండడం విషాదకరమైన విషయం. నగరానికి చెందిన సామియా అబ్దుల్ హఫీజ్ (22) అనే మహిళ గతేడాది ఏప్రిల్‌లో కేన్సర్ రోగి అవతారమెత్తి ఒక ఫండ్ రైజింగ్ ఫేస్‌బుక్ పేజీని సృష్టించింది. తద్వారా రూ.22లక్షలు కొల్లగొట్టింది. అయితే ఈ విషయం బయటపడడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
2014లో ప్రారంభం...
‘మెడికల్ క్రౌడ్ ఫండింగ్ బాడీగా ‘ఇంపాక్ట్ గురు’ను 2014లో స్థాపించాం. నాలుగేళ్లలోనే ఎంతో విస్తరించింది. ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం ఆధారపడదగ్గ భారతదేశ అతిపెద్ద వేదిక ఇది. పేద రోగులు, తీవ్రమైన అనారోగ్యంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారు అలాగే కేన్సర్, డయాలసిస్, ప్రీమెచ్యూర్ బేబీకేర్ తదితర ఖరీదైన దీర్ఘకాల చికిత్సల కోసం తమ వద్దనున్న సొమ్మంతా ఖర్చు చేసేసినా సరిపోని మధ్యతరగతి వర్గాలు... వీరి అవసరాలే లక్ష్యంగా ఈ క్రౌడ్ ఫండింగ్ వేదిక ఆవిర్భవించింది. ఏ మార్గమూ లేని వీరికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా తిరిగి తీర్చనవసరం లేని రుణం అందుతుంది. హెల్త్‌కేర్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలని, వీలైనన్ని జీవితాలను రక్షించాలనేది మా లక్ష్యం’ అని చెప్పారు నిర్వాహకులు.
పలువురికి సాయం...
సిటీలో చాలా మందికి సాయమందించాం. లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న షణ్ముఖ అనే 11నెలల చిన్నారికి గ్లోబల్‌ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స నిమిత్తం కేవలం వారం రోజుల్లో రూ.10లక్షలు సేకరించగలిగాం. అదే విధంగా మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతూ లిటిల్‌స్టార్స్ చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ శంకర్ అనే రెండేళ్ల బాలుడికి ఆర్ధిక సాయం అందించగలిగాం. ఇలా మరెంతో మందికి సాయం చేశాం.ఈ విధానంపై సిటీజనుల్లో అవగాహన పెరిగి మరింత మందికి మా వేదిక ఉపయోగపడాలనికోరుకుంటున్నాం. – పీయూష్ జైన్, సీఈఓ, కో–ఫౌండర్,ఇంపాక్ట్ గురు
Comments
Please login to add a commentAdd a comment