ముంబై: గోల్డ్‌మ్యాన్ శాక్స్ భారత్‌లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్‌మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది.
‘వుమెన్‌ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసింది.
గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు.
భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment