గణాంకాలు చెప్పే నిజాలు!  | Sakshi Editorial On Migration For Employment opportunities | Sakshi
Sakshi News home page

గణాంకాలు చెప్పే నిజాలు! 

Published Thu, Oct 26 2023 5:19 AM | Last Updated on Thu, Oct 26 2023 5:19 AM

Sakshi Editorial On Migration For Employment opportunities

సరైన ప్రాతిపదికలు ఎంచుకుని, శాస్త్రీయ విధానంలో నమూనాలు రూపొందించుకుని వాటి ఆధారంగా సర్వే చేయాలేగానీ గణాంకాలెప్పుడూ అబద్ధం చెప్పవు. అలాగే అవి అన్నిసార్లూ పాలకులను రంజింపజేయలేవు. అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాలు కూడా తప్పకపోవచ్చు. వెల్లడైన అంశాల్లోని వాస్తవాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించగలిగితే స్థితి గతులు మెరుగుపడతాయి.

మనను చిన్నబుచ్చటానికే, ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఇలాంటి గణాంకాలు అందిస్తున్నారని కొట్టిపారేస్తే అందువల్ల ప్రయోజనం ఉండదు. తాజాగా 2023కి సంబంధించిన అంచనాలతో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విడుదల చేసిన నివేదిక వెలువరించిన గణాంకాలు మనకు ఏక కాలంలో అటు సంతోషాన్నీ, ఇటు నిరాశనూ కూడా కలిగిస్తుండగా...

ప్రపంచ బ్యాంకు నివేదిక ఓ విధంగా భయపెడుతోంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం సంపన్న రాజ్యాలకు అంతక్రితం కన్నా 2021, 2022 సంవత్సరాల్లో వలసలు బాగా పెరిగాయి. ఇందుకు ఉక్రెయిన్‌ యుద్ధం చాలావరకూ దోహదపడి వుండొచ్చు. ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు యూరోప్‌ దేశాలకు వలసపోయారు. అలాగే 2020లో ప్రతి దేశమూ సరిహద్దులు మూసి వేయటంతో వలసలు దాదాపుగా నిలిచిపోయాయి గనుక దాంతో పోలిస్తే వలసలు పెరిగి వుండొచ్చు.

అయితే స్థూలంగా చూస్తే వలసలు పెరిగాయి. అదే సమయంలో ఆ వలసల్లో మహిళల శాతం కూడా పెరిగింది. నిరుడు మన దేశంనుంచే వలసలు అధికంగా వున్నాయని నివేదిక సారాంశం. ఉన్నత విద్యకోసం వెళ్లేవారిని మినహాయించి కేవలం ఉపాధి కోసం వెళ్తున్నవారినే లెక్కేస్తే భారత్‌ నుంచి ఈసారి ఎక్కువమంది ఉద్యోగార్థులు వెళ్లారని ఆ నివేదిక వివరిస్తోంది.

ఓఈసీడీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు సహా 38 సంపన్న దేశాలకు సభ్యత్వం వుంది. ఈ దేశాలకు 2021–22 మధ్య పదిలక్షల మంది వివిధ దేశాల నుంచి వలస రాగా అందులో 4.07 లక్షల మంది మన పౌరులు. ఉన్నత విద్య కోసం వెళ్లేవారిలో భారత్‌ రెండో స్థానంలో వుంది. మన దేశం నుంచి ఈ కేటగిరీలో 4.24 లక్షలమంది వుండగా, చైనా 8.85 లక్షలతో అగ్రభాగాన వుంది. అటు ఉపాధి కోసమైనా, ఇటు విద్యార్జన కోసమైనా అత్యధికులు ఎంచుకుంటున్నది అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా దేశాలేనని నివేదిక వెల్లడిస్తోంది.

ఈ వలసల గణాంకాలు గమనిస్తే అంతర్జాతీయంగా వుండే తీవ్ర పోటీని తట్టుకుని మన దేశం నుంచి ఎక్కువమంది ఉపాధి అవకాశాలను గెల్చు కుంటున్నారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లినవారు తమ కుటుంబాలకు పంపే నగదు నిరుడు బాగా పెరిగింది. ఆ ఏడాది 11,100 కోట్ల డాలర్లు భారత్‌కు విదేశాల నుంచి వచ్చిందని అంచనా. ఇది దేశ జీడీపీలో 3.3 శాతం. అంతేకాదు...  ప్రపంచ దేశాలన్నిటిలో చాలా అధికం. ఈ నగదులో 36 శాతం అమెరికా, బ్రిటన్, సింగపూర్‌ల నుంచి వచ్చిందేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే భారత్‌కూ, అభివృద్ధి చెందిన దేశాలకూ సంబంధ బాంధవ్యాలు ఎంత పెరిగాయో తెలుస్తున్నది.

అటు విద్యారంగాన్ని గమనిస్తే ఉన్నత చదువుల కోసం పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నదని అర్థమవుతుంది. ఈ విషయంలో లింగ వివక్ష కూడా తగ్గిందని ఓఈసీడీ నివేదిక వివరిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లేవారు అంతక్రితంతో పోలిస్తే రెట్టింపు పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉపాధి కోసమైనా, విద్య కోసమైనా వెళ్లేవారు పెర గటం మనవాళ్ల సత్తాను చాటుతోంది. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యాలుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు.

అయితే ఇదే సమయంలో మన దేశంలో అటువంటి నిపుణులకు తగిన అవకాశాలు లేవన్న చేదు వాస్తవం  వెల్లడవుతోంది. తగిన ఉపాధి, మంచి వేతనాలు లభించినప్పుడు వాటిని వదులు కుని ఎవరూ అయినవారికి దూరంగా పరాయి దేశాలకు వలస వెళ్లాలనుకోరు. వెళ్తున్నారంటే అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలు చూపలేకపోతున్నామని, మెరుగైన వేతనాలు ఇవ్వలేకపోతున్నా మని అర్థం. ఆ నైపుణ్యాలను మన దేశాభివృద్ధికి వినియోగించలేకపోతున్నామని, తగిన శ్రద్ధ పెట్ట డంలేదని గుర్తించాలి.

ఈ సందర్భంలో ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఇచ్చిన గణాంకాల ఆధారంగా రూపొందిన ప్రపంచ బ్యాంకు నివేదికను కూడా ప్రస్తావించుకోవాలి. నిరుడు మన ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగిత అధికంగా వున్నదని ఆ నివేదిక తెలిపింది. మన దేశ యువతలో నిరుద్యోగిత  23.22 శాతం వుంటే, పాకిస్తాన్‌ (11.3 శాతం),బంగ్లాదేశ్‌ (12.9 శాతం), ఆఖరికి భూటాన్‌ (14.4 శాతం)లతో మనకంటే దూరంగా వున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. 

విదేశాలకెళ్లేవారు పెరగటం గర్వపడాల్సిన విషయమేననటంలో సందేహం లేదు. ఉన్నత విద్యా రంగంలో చూస్తే మన దేశంలో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నత శ్రేణి విద్యాసంస్థలున్నాయి. అవి కూడా వివిధ అంశాల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా నిలబడలేకపోతున్నాయి. బోధనారంగ నిపుణులు కూడా అంతే. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు లభించి తగిన వేతనాలు లభిస్తే ఇక్కడే ఉంటారు.

అందువల్ల మన పిల్లల స్థితిగతులు మరింత మెరుగుపడతాయి. విదేశాల్లో విశ్వవిద్యాలయాలు ఇక్కడివారిని ఆకర్షించి భారీ మొత్తంలో వేతనాలిస్తుంటే మన సంస్థలు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఉపాధి విషయంలోనూ అంతే. తయారీ రంగ పరిశ్రమలను పెంచగలిగితే, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు మరింత మెరుగ్గా చేయూతనందించగలిగితే వలస పోయేవారి మేధస్సు పూర్తిగా ఇక్కడే వినియోగపడుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమై జీవనప్రమాణాలు పెరగటానికి దోహదపడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement