సిటీబ్యూరో: జిల్లా పాలనలో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయం శిథిలమై ప్రమాదకరంగా మారింది. కొత్త భవనానికి ప్రభుత్వం సరిపడినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ కలెక్టరేట్ భవన సముదాయం పూర్తిగా శిథిలమైంది. ఇందులో ప్రస్తుతం తొమ్మిది ప్రభుత్వ శాఖలకు చెందిన 300 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణానికి రూ.19.80 కోట్ల నిధులను గత ఏడాది నవంబర్‌లో విడుదల చేసింది.
అయితే, జిల్లా కలెక్టరేట్లను ఇంటిగ్రేటేడ్ భవన సముదాయంగా నిర్మించుకుంటే పరిపాలన సులభమవుతుందని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీందో కలెక్టరేట్‌తో సహా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నాంపల్లిలోని పాత కలెక్టరేట్ భవనం స్థానంలోనే కొత్త భవన సముదాయం నిర్మించుకునేందుకు జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇది 18 అంతస్తులు ఉండేలా ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం తక్కువ నిధులు మంజూరు చేయటంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. రెండవ దశ నిధుల మంజూరుకు పట్టుదలతో అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా.. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనంలోని తొమ్మిది ప్రభుత్వశాఖలను ఎక్కడి తరలించాలని మథనపడుతున్నారు.