నిధులు భారీగా.. పనులు నాసిరకంగా..!
♦ రూ.187 లక్షల నిధులతో రెనివల్ రోడ్డు పనులు
♦ డిప్యూటీ స్పీకర్ సూచనలు పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
♦ మున్నాళ్ల ముచ్చటగా ‘ముక్టాపూర్-ఎల్గోయి’ వర్క్స్
♦ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్న అధికారులు
మనూరు : జిల్లాలోనే అతిపెద్ద మండలం మనూరు. అయితే, దశాబ్దాలుగా అభివృద్ధి అంతే మండల ప్రజలకు తెలియని విషయం. ఏ పనులు జరుగుతున్నా.. ఎవరూ చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఇక్కడి ప్రజలు, నాయకుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ఉప-ఎన్నికలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి పరిస్థితులు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఉప-ఎన్నికల పుణ్యమా అని ప్రభుత్వం నియోజకవర్గానికి భారీగానే అభివృద్ధి నిధులు కేటాయించింది. అయితే, అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. ఫలితంగా కోట్లలో విడుదలైన నిధులను.. కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో స్వాహీ చేవారు.
ఇందులో భాగంగానే మనూరు మండలంలోని ముక్టాపూర్ వయా ఎల్గోయి రోడ్డు. కరస్‌గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ముక్టాపూర్, వల్లూర్ తోర్నాల వరకు రోడ్డు రెనివల్ కోసం ప్రభుత్వం రూ.138 లక్షల నిధులు మంజూరుచేసింది. పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గత ఉప ఎన్నికల కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ ఆవిష్కరించారు. ఆపై రహదారి వేసి మూడు నెలలు గడవక ముందే వేసిన రోడ్డు బీటీ ధ్వంసమైంది. ఇది గమనించిన ఆర్‌అండ్‌బీ అధికారులు పెద్ద మొత్తంలో రోడ్డు వెంట భారీ ప్యాచ్‌లు వేశారు. కానీ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు మళ్లీ ధ్వంసమవుతోంది. కనీసం రోడ్డు ఇరువైపులా వేసిన బర్మ్స్ కూడా కనిపించడం లేదు. రహదారి వేయగా మిగిలిన కంకరనే సైడ్‌బర్మ్‌కు ఉపయోగించడం కాంట్రాక్టర్ గొప్పతనం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు పనులు చూసి అవాక్కవుతున్నారు.