r&b officials
-
ఇప్పటంపై జనసేన మరో కొత్త నాటకం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది. తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు ఎవరెవరు స్థలాలిచ్చారో అదే రోజు వేదికపైనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు అధికారులు తొలగించిన ఆక్రమణల జాబితాలో వారెవరూ లేకపోవడం గమనార్హం. తొమ్మిది మంది సభకు స్థలాలు ఇచ్చినట్లు నాడు జనసేన ప్రకటించగా అందులో ఒక్కరికి మాత్రమే అధికారులు ఆక్రమణల కింద నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారి ఇళ్లు, దుకాణాలు రోడ్డుకు దరిదాపుల్లోనే లేవు. అయితే ఆ ఇంటి యజమాని కూడా ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అధికారులు ఆ నివాసాన్ని వదిలేసి మిగిలిన ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతల ఆరోపణలు బెడిసికొట్టడంతో మార్చిలో నిర్వహించిన జనసేన ప్లీనరీకి 31 మంది భూములిచ్చారని, వారి ఇళ్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. పార్కింగ్‌కు వాడుకుని.. ఇప్పటంలో ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు మార్కింగ్ చేసినప్పుడు మొత్తం 53 ప్రైవేట్ ఆస్తులు, ఒక పంచాయతీ భవనం ఆక్రమణల పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31 మంది తమ ప్లీనరీకి భూములిచ్చిన సానుభూతిపరులంటూ జనసేన బుకాయిస్తోంది. నిజానికి వీరి భూములు సభ జరిగిన ప్రాంతాన్ని ఆనుకుని ఉండటం, ఆ సమయంలో పొలాల్లో ఎలాంటి పంటలు లేకపోవడంతో ప్లీనరీ వాహనాల పార్కింగ్‌గా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా వారి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వాడుకోవడం గమనార్హం. సభకు భూములిచ్చింది 9 మందే.. ఇప్పటంలో జనసేన సభకు భూములిచ్చిన తొమ్మిది మందికి సర్వే నం.167, 167(బి)లో పొలాలున్నాయి. సభ నిర్వహణకు వారు అంగీకరిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్‌కు అర్జీ అందింది. జనసేన నేతలు చెబుతున్న 31 మంది పొలాలు సమీపంలోనే ఉన్నా అనుమతి తీసుకోలేదు. స్థానిక టీడీపీ నాయకుడైన శంకరశెట్టి పిచ్చయ్య గతంలో సర్పంచ్‌గా పని చేశారు. తర్వాత ఆయన భార్య కూడా సర్పంచ్‌గా ఉన్నారు. జనసేన సభకు పొలాలు ఇచ్చిన 9 మందిలో ఆయన ఇల్లు మాత్రమే రోడ్డును ఆనుకుని ఉంది. ఆయన ఇంటి ప్రహరీ, మెట్లు ఆక్రమణ పరిధిలోకి రావడంతో అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై ఆయన జూన్‌లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో పిచ్చయ్య ఇంటి ప్రహరీని అధికారులు తొలగించలేదు. గతంలోనే విగ్రహ తొలగింపు ప్రక్రియ ఇప్పటంలో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పరిధిలోకి 53 ప్రైవేట్ ఆస్తులు, రెండు దేవాలయాలు, మరో రెండు వైఎస్సార్ విగ్రహాలు వచ్చాయి. వీటిలో ఒక విగ్రహ తొలగింపు ప్రక్రియ గతంలోనే చేపట్టి రెయిలింగ్, దిమ్మె తొలగించారు. మరో ప్రాంతానికి తరలించే లోగా జనసేన రాద్దాంతం సృష్టించింది. ఆ విగ్రహాన్ని సోమవారం తరలించారు. మరో విగ్రహాన్ని రోడ్డు పనులు ప్రారంభించే లోగా తరలించాలని నిర్ణయించారు. జనసేన సభకు భూములిచ్చిన వారి వివరాలు 1. వింటా సాంబిరెడ్డి (సర్వే నం.167(బి): సొంతూరు గన్నవరం సమీపంలోని తేలప్రోలు కాగా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వెనుక ఉన్న వజ్ర రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఎండు చేపల వ్యాపారం చేసే ఈయన ఇప్పటంలో ఏడెనిమిదేళ్ల క్రితం పొలం కొనుక్కున్నారు. ఇప్పటంలో ఎలాంటి నివాసం లేదు. 2. లక్కాకుల ఆదినారాయణ: ఈయన నివాసం ఊరు మధ్యలో ఉంది. 3. తిరుమలశెట్టి సామ్రాజ్యం: లక్కాకుల ఆదినారాయణ సోదరి. చీరాలలో ఉంటారు. ఈమెకు ఇప్పటంలో సొంతిల్లు లేదు. 4. గాజుల సాబయ్య: ఈయన ఇల్లు కూడా ఆదినారాయణ ఇంటికి సమీపంలోనే ఊరికి మధ్యన ఉంది. 5. శంకరశెట్టి శ్రీనివాసరావు: (పిచ్చయ్య తమ్ముడు) గుంటూరులో ఉంటారు. వారసత్వంగా వచ్చిన ఇల్లు గ్రామంలో ఉంది. 6. శంకరశెట్టి పిచ్చయ్య: ఈయన ఇల్లు పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉంది. ప్రహరీతో పాటు ఇంటి మెట్లు ఆక్రమణల పరిధిలోకి వచ్చాయి. ఏప్రిల్, మేలో నోటీసులు ఇవ్వడంతో జూన్‌లో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అధికారులు ఈయన ఆస్తిని ముట్టుకోలేదు. 7. శంకరశెట్టి రాయుడు, 8. శంకరశెట్టి ఉమామహేశ్వరరావు, 9. గాజుల నర్సియ్య: వీరి నివాసాలు గ్రామంలోనే ఉన్నాయి. -
ఎన్డీబీ రీ టెండర్లలో 12 బిడ్లు
సాక్షి, అమరావతి: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సాయంతో రాష్ట్రంలో రహదార్లు, వంతెనల పునర్నిర్మాణ పనులకు సంబంధించి గత నెలలో పిలిచిన రీ టెండర్లలో 10 కాంట్రాక్టు సంస్థలు 12 బిడ్లు దాఖలు చేశాయి. తొలిదశలో నాలుగు జిల్లాల్లో పిలిచిన రీ టెండర్ల టెక్నికల్ బిడ్లను ఆర్అండ్బీ అధికారులు సోమవారం తెరిచారు. ఒక్కో జిల్లాలో మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతంలో మాదిరిగా 13 జిల్లాలకు ఒకేసారి టెండర్లు పిలవకుండా నాలుగు జిల్లాలకు మాత్రమే రీ టెండర్లు పిలిచారు. మొత్తం రూ.6,400 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణానికి సంబంధించి.. తొలిదశలో రూ.1,860 కోట్లతో 13 ప్యాకేజీలకు మొదట ఈ–టెండర్లు పిలవగా 14 సంస్థల నుంచి 25 బిడ్లు మాత్రమే వచ్చాయి. దీనిపై ఆర్అండ్బీ ముఖ్య అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోటీతత్వం పెంచేందుకు ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలవాలని ఆదేశించడంతో అవి రద్దయిన సంగతి తెలిసిందే. రీ టెండర్లకు తొలివిడతగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలను ఎంపికచేసిన అధికారులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీచేశారు. రెండు నిబంధనల్ని సవరించి, నాలుగు జిల్లాల్లో రూ.682.16 కోట్ల పనులకు సంబంధించి ఈ టెండర్లను పిలిచారు. సోమవారం ఈ టెక్నికల్ బిడ్లు తెరిచిన అధికారులు వాటిని పరిశీలించి అర్హత సాధించిన సంస్థల వివరాలు ప్రకటిస్తారు. అనంతరం రివర్స్ టెండర్లు నిర్వహించనున్నారు. -
నిధులు భారీగా.. పనులు నాసిరకంగా..!
♦ రూ.187 లక్షల నిధులతో రెనివల్ రోడ్డు పనులు ♦ డిప్యూటీ స్పీకర్ సూచనలు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు ♦ మున్నాళ్ల ముచ్చటగా ‘ముక్టాపూర్-ఎల్గోయి’ వర్క్స్ ♦ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్న అధికారులు మనూరు : జిల్లాలోనే అతిపెద్ద మండలం మనూరు. అయితే, దశాబ్దాలుగా అభివృద్ధి అంతే మండల ప్రజలకు తెలియని విషయం. ఏ పనులు జరుగుతున్నా.. ఎవరూ చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఇక్కడి ప్రజలు, నాయకుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ఉప-ఎన్నికలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి పరిస్థితులు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఉప-ఎన్నికల పుణ్యమా అని ప్రభుత్వం నియోజకవర్గానికి భారీగానే అభివృద్ధి నిధులు కేటాయించింది. అయితే, అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. ఫలితంగా కోట్లలో విడుదలైన నిధులను.. కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో స్వాహీ చేవారు. ఇందులో భాగంగానే మనూరు మండలంలోని ముక్టాపూర్ వయా ఎల్గోయి రోడ్డు. కరస్‌గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ముక్టాపూర్, వల్లూర్ తోర్నాల వరకు రోడ్డు రెనివల్ కోసం ప్రభుత్వం రూ.138 లక్షల నిధులు మంజూరుచేసింది. పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గత ఉప ఎన్నికల కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ ఆవిష్కరించారు. ఆపై రహదారి వేసి మూడు నెలలు గడవక ముందే వేసిన రోడ్డు బీటీ ధ్వంసమైంది. ఇది గమనించిన ఆర్అండ్బీ అధికారులు పెద్ద మొత్తంలో రోడ్డు వెంట భారీ ప్యాచ్‌లు వేశారు. కానీ, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు మళ్లీ ధ్వంసమవుతోంది. కనీసం రోడ్డు ఇరువైపులా వేసిన బర్మ్స్ కూడా కనిపించడం లేదు. రహదారి వేయగా మిగిలిన కంకరనే సైడ్బర్మ్కు ఉపయోగించడం కాంట్రాక్టర్ గొప్పతనం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డు పనులు చూసి అవాక్కవుతున్నారు. -
అనుకూలంగా ‘గంట’ కొట్టేస్తున్నారు
ఆర్అండ్బీ అధికారుల నిర్వాకం మంత్రి జిల్లాలోనే నిబంధనలకు తూట్లు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణం ఇక్కడ నిబంధనలు చెల్లవు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే అధికారులు నడుచుకోవాలి. స్వయంగా ఆర్అండ్బీ శాఖ మంత్రి సొంత జిల్లా కావడంతో నిబంధనలు కూడా వారికి అనుకూలంగా తిరగ రాసేసుకుంటున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు అమలు చేసేస్తున్నారు. ఆర్అండ్బీ శాఖలో అన్నిచోట్ల నిబంధనలు తుంగలోతొక్కి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మిగిలిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నా ఫలితం లేకుండా పోతోంది. -సాక్షి ప్రతినిధి, ఒంగోలు నిబంధన ఇలా : ఎక్కడైనా టెండర్లు పిలిస్తే బిడ్ దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్‌కు కనీస గడువు ఉంటుంది. పద్ధతిగా టెండర్లయితే పదిహేను రోజులు, అత్యవసర టెండర్లయితే మూడు నుంచి ఏడు రోజుల వరకూ గడువిస్తారు. అయితే మామూలు మరమ్మతు పనులకు జిల్లా ఆర్అండ్బీ అధికారులు ఇచ్చిన సమయం ఎంతో తెలిస్తే ఓ గంట మాత్రమే. తుంగలో ఇలా: గంటలోనే టెండర్లు వేయాలంటూ కొత్త నిబంధన అధికార పార్టీ రచించింది. లేకపోతే ఆన్లైన్ బిడ్ క్లోజ్ అయిపోతుందని హెచ్చరిస్తోంది. ఇదీ కనిగిరి ఆర్అండ్బీ డివిజన్లో అవలంబిస్తున్న కొత్త ఎత్తుగడ. ముందుగానే ఎమ్మెల్యే మనుషులకు చెప్పి ఫలానా టెండర్‌కు ఈఎండీ కోసం డీడీలు తీసి సిద్ధం చేయిస్తారు. అకస్మాత్తుగా ఉదయం 10.30 గంటలకు ఆన్లైన్లో టెండర్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా గంట తర్వాత బిడ్ క్లోజ్ చేస్తారు. ఈలోగానే బిడ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించుకున్నవారు మాత్రమే దీనిలో టెండర్లు వేయడానికి వీలవుతుంది. వివరాలు లేకుండానే : లక్ష రూపాయలకు మించిన ఏ పనైనా ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీని ప్రకారం బుధవారం ఉదయం కనిగిరి డివిజన్‌కు సంబంధించి రెండు రోడ్లను మరమ్మతులు చేయడానికి రూ.9.41 లక్షలు అంచనా విలువతో టెండర్లు పిలిచారు. దీనికి బిడ్ సెక్యూరిటీగా రూ.9,500 నిర్ణయించారు. కనీసం ఏ రోడ్లు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ మరమ్మతులు చేయాలన్న కనీస వివరాలు కూడా లేకుండానే ఆన్లైన్ టెండర్లు పిలిచారు. మరో టెండర్ కందుకూరు, పామూరు రోడ్డు, దొనకొండ - కనిగిరి - దోర్నాల రోడ్డు మరమ్మతుల కోసం రూ.3.93 లక్షలు పిలిచారు. దీనికి కూడా కేటాయించిన సమయం గంట మాత్రమే. ఇటీవల కాలంలో కనీసం ఎనిమిది టెండర్లను ఇదే పద్ధతిలో పిలిచినట్లు సమాచారం. దీనిపై అధికారుల వివరణ కోరగా తాము నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, దీన్ని ఎందుకు వివాదం చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం ఉంటే వారికి అనుకూలంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, తమ ఇబ్బందులు అర్థం చేసుకోవాలని ఆ అధికారి చెప్పుకొచ్చారు. -
పంచాయతీ భవనం చూపించి బిల్లు తీసుకున్నారు!
బషీరాబాద్: తవ్విన కొద్ది ‘ఇందిరమ్మ’ ఇళ్ల బాగోతం బయటపడుతోంది. అక్రమార్కులు ఏకంగా బషీరాబాద్ గ్రామ పంచాయతీ భవనాన్ని చూపించి బిల్లును తీసుకున్నారు. బుధవారం సీబీ సీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్సై వేణుమాధవ్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి బషీరాబాద్‌లో విచారణ జరిపారు. పంచాయతీ భవనంలో రిటైర్ బ్యాంకు ఉద్యోగి కమలమ్మ ఉంటోంది. ఆమె పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు ఉండటంతో అధికారులు కమలమ్మ ఉండే పంచాయతీ భవనానికి వెళ్లారు. తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన విషయం తెలియదని ఆమె తెలిపింది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. గోసాయి కాలనీలో పాతకాలం నాడు నాపరాతి ముక్కలతో నిర్మించిన ఇంటికి బిల్లు చెల్లించారని అధికారుల విచారణలో తేలింది. శిథిలావస్థకు చేరిన ఇం టికి సైతం అధికారులు బిల్లు చెల్లించారు.పంచాయతీ పరిధిలోని నవాంద్గి గ్రామంలో 4 పాత ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఓ ఇంటి అడ్రస్ లభించలేదు.బషీరాబాద్ పంచాయతీ పరిధిలోని సీబీ సీఐడీ అధికారుల ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అధికారులు 223 ఇళ్లను పరిశీలించేందుకు వచ్చారు. అందులో 10 ఇళ్ల అడ్రస్ దొరకలేదు. ఇప్పటికీ అడ్రస్ లేని ఇళ్ల సంఖ్య 92కు చేరింది. ఆర్అండ్బీ అధికారుల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు తెలిపారు. ఇళ్ల అడ్రస్ లేకుండా బిల్లులు తీసుకున్న వారి వివరాలు సేకరించేందుకు తమ సిబ్బంది బషీరాబాద్‌లోనే ఉంటారని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని సీబీ సీడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. -
రోడ్డున పడమంటారా?
150 ఫీట్లు విస్తరిస్తే ఇళ్లన్నీ కోల్పోతాం కొత్త మార్కింగ్ వద్దే వద్దు కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును 100 ఫీట్లే విస్తరించాలి రోడ్డుకిరువైపులా కుటుంబాల డిమాండ్ కొలతలేస్తున్న ఆర్అండ్బీ అధికారులు రోడ్డు విస్తరణ రగడ రాజుకుంటోంది. 100 ఫీట్ల విస్తరణ కాస్త.. సీఎం ఆదేశాలతో 150 ఫీట్లకు పెరగనుంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్ల వారు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ఇష్టారీతిన మార్కింగ్‌తో ఇప్పటికే నష్టపోతున్నామని, తాజాగా 150 ఫీట్లంటే ఒప్పుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. తమ అభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని స్పష్టంచేస్తున్నారు. వరంగల్ రూరల్: కేయూసీ-పెద్దమ్మగడ్డ రహదారి విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నగరంలో రహదారులను 150ఫీట్ల మేరకు విస్తరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రోడ్లు-భవనాల శాఖ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. కేయూసీ-రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ. 8 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఇటీవల విస్తరణ పనులు ప్రారంభించారు. రోడ్డుకు ఇరుపక్కల తవ్వి బేస్గ్రావెల్ వేసి పనులు చేయిస్తున్నారు. నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ఆర్అండ్బీ అధికారులు రోడ్డు మధ్య భాగం నుంచి ఇరుపక్కల 50 ఫీట్లు ఉండేలా మార్కింగ్ చేశారు. కానీ ఇలా అన్నిచోట్ల చేయలేదని, కొందరు పలుకుబడితో తమ వైపు 35 ఫీట్ల వరకే స్థలాన్ని అప్పగిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మాజీ కార్పొరేటర్ తన స్థలం పోకుండా ఉండేందుకే అధికారులతో తప్పుడు మార్కింగ్ చేయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారికి ఇరుపక్కల ఒకే విధంగా మార్కింగ్ చేయాలని అధికారులను ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. అలా చేస్తే భవనాలకు ముప్పు.. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును 150ఫీట్ల మేరకు విస్తరిస్తే పలు భవనాలు కూల్చేసే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లుగా కేయూసీ-పెద్దమ్మగడ్డ ఉంది. అందుకే స్థానికులు తమ ఇళ్లను నిబంధనల మేరకు స్థలం విడిచిపెట్టి నిర్మించుకున్నారు. రోడ్డుకిరువైపులా 50 ఫీట్లు ఉండేలా మార్కింగ్ చేస్తే కొన్ని పాత ఇళ్లు కూల్చివేతలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇక 150ఫీట్లుగా నిర్ధారిస్తే మొత్తం గృహాలు కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. రెండు రోజులుగా ఆర్అండ్బీ అధికారులు ఇరుపక్కల 75 ఫీట్లు కొలిచి మార్కింగ్ చేస్తుండడంతో స్థానికులు ఆందోళనలకు గురవుతున్నారు. మొదట ప్రకటించిన ట్లుగా ఈ రహదారిని నాలుగు లేన్లుగా 100 ఫీట్లకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 150 ఫీట్లు వద్దేవద్దు.. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును మాస్టర్ ప్లాన్‌లోని ఆర్డీపీ(రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్)లో ఉన్నట్లుగానే అభివృద్ధి చేయాలి. అధికారంలో ఉన్నం కదా అని ఇష్టానుసారం చేస్తే ఎలా? రోడ్డును 150 ఫీట్లకు విస్తరిస్తామని అనడం సరికాదు. - దాసరి రమేష్, రెడ్డి కాలనీ ఇరుపక్కల సమానంగా విస్తరించాలి రహదారిని అభివృద్ధి చేసేందుకు ఇరు పక్కల సమానంగా మార్కింగ్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా.. కొన్ని చోట్ల ఎక్కువగా మార్కింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మొత్తం ఒకేలా ఉండేలా చూడాలి. - రవికుమార్, స్థానికుడు మార్కింగ్‌లపై ఆందోళనలు తప్పవు పెద్దమ్మగడ్డ రోడ్డును 100నుంచి 150 ఫీట్లు వెడల్పు చేసేందుకు చేస్తున్న మార్కింగ్‌లపై ఆందోళనలు నిర్వహిస్తాం. 50 ఫీట్లు పెంచడం వల్ల నివాసాలు లేకుండా పోయి పరిస్థితులు ఏర్పడుతాయి. అందరి పరిస్థితులను పరిశీలించి న్యాయం చేయాలి. - కె.రమేష్, యాదవనగర్ -
రహదారులకు నిధుల వరద
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రహదారుల నిర్మాణం, విస్తరణకు మోక్షం కలగనుంది. ఒక వరసతో ఉన్న రహదారులన్నీ రెండు వరసల రోడ్లుగా మారనున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ తారురోడ్లు వేయనున్నారు. కొత్త వంతెనలను నిర్మించనున్నారు. శిథిల నిర్మాణాలకు మరమ్మతులు చేయను న్నారు. ఈ మేరకు రహదారు లు, భవనాలశాఖకు ప్రభుత్వం రూ. 1011.50 కోట్లు విడుదల చేసింది. 45 సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడంతోపాటు గ్రామాలకు మండల అనుసంధానం కోసం 14 ర హదారులు, శిథిల వంతెనలతోపాటు కొత్తగా 35 వంతెనలు నిర్మించేందుకు ఆర్అండ్బీ అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ద్వారా పనుల చే పట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటిసారి భారీగా నిధులు రోడ్లు, వంతెనల నిర్మాణం, విస్తరణ పనులతో జిల్లాకు మహర్ధశ పట్టనుంది. ఇందుకోసం రహదారుల, భవనాలశాఖకు మొదటిసారిగా ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు విడుదల చేసింది. ఏక వరసలో ఉన్న 45 రహదారులను రెండు వరసల రోడ్లుగా విస్తరించేందుకు రూ. 618.45 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.85 కోట్ల విలువ చేసే ఐదు రోడ్లు కోర్రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) స్కీం కిందకు వస్తాయి. 15 మండలాలతో వివిధ గ్రామాలను అనుసంధానం చేసే 14 రహదారులను నిర్మాణం కో సం రూ.231 కోట్లు కేటాయించారు. శిథిల మైన, కొత్త వంతెనల నిర్మాణం కోసం మరో రూ.162.05 కోట్లు విడుదల చేశారు. సింగిల్ లేన్ రోడ్ల విస్తరణ కోసం అత్యధికంగా వర్ని- మొండిసడక్ రోడ్డు కోసం రూ.35 కోట్లు, నిజామాబాద్-వర్నికి రూ.30 కోట్లు, జుక్కల్-మద్నూరుకు రూ.19 కోట్లు, రాజంపేట్-గుండారంకు రూ.18 కోట్లు, నందిపేట-చిన్నయానం రోడ్డుకు రూ.17 కోట్లు, మద్దుల-గడ్కోల్ రహదారికి రూ.16.80 కోట్లు కేటాయించగా.. అత్యల్పంగా తాళ్లమడుగు-దోంచందాకు రూ. 3.20 కోట్లు, మెండోరా-కొడిచెర్లకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. మండల కేంద్రాల అ నుసంధాన రోడ్లు, వంతెనలకు కూడా ప్రాంతాలవారీగా నిధులు మంజూరు చేశారు. జనవరి 2 నాటికి కాంట్రాక్టర్ల ఖరారు ఈ భారీ నిధులతో చేపట్టే పనుల కోసం టెండర్ల ప్రక్రియ జరిపేందుకు రహదారులు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదివరకు ఆర్అండ్బీ పర్య వేక్షక ఇంజనీర్‌గా ఉన్న మాధవి సుకన్య ఇటీవలే బదిలీ కాగా, కొత్తగా పి.మధుసూదన్ రెడ్డి విధుల్లో చేరారు. టెండర్ల ప్రక్రియ తదితర విధివిధానాల గురించి చీఫ్ ఇంజనీర్, కమిషనర్‌తో చర్చించేందుకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. రూ.50 లక్షలు పైబడిన పనులన్నింటికీ చీఫ్ ఇంజినీర్, ఆపైబడిన పనులకు ఇంజి నీర్ ఇన్ చీఫ్ కార్యాలయాల నుంచి టెండర్లు పిలుస్తారు. జనవరి రెండు నాటికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. -
‘పర్యవేక్షణ’ కోసం ప్రయత్నాలు
* ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ పోస్టు * త్వరలో భర్తీ అయ్యే అవకాశాలు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రోడ్లు భవనాల శాఖలో ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ ఎస్ఈ (పర్యవేక్షక ఇంజినీర్) పోస్టు కోసం ఆ శాఖలోని కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో రహదారుల అభివ ృద్ధిపై ప్రభుత్వం ద ృష్టి సారించి.. జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి రోడ్లను అద్దంలా నిర్మిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కీలకమైన ఈ పోస్టు కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉన్నతాధికారి జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో అధికారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ గతంలో ఎస్ఈగా పనిచేసిన జి.హంసారెడ్డి ఆరు నెలల క్రితం ఏసీబీకి చిక్కారు. పనుల అనుభవం (ఎక్సిపీరియెన్స్ సర్టిఫికేట్) మంజూరు కోసం ఓ కాంట్రాక్టరు వద్ద రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏప్రిల్ 4న అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి రూ.కోట్లలో ఆస్తులు కూడగట్టారనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి నుంచి ఈ పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. కరీంనగర్ జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న చందూలాల్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన ఈ పోస్టును భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్‌చార్జీగా ఉన్న చందూలాల్‌కే ఇక్కడికి బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేందుకు చందూలాల్ ఆసక్తి చూపుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. రహదారుల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలోని పలు రోడ్ల నిర్మాణం, మరమ్మతుకు మోక్షం కలగనుంది. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు జిల్లాలోని పలు రహదారుల అభివ ృద్ధి పనులకు అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లైన్ రోడ్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అలాగే మన ఊరు.. మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పలు రోడ్ల అభివ ృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. -
గజ్వేల్‌కు మహర్దశ!
నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం, ఇందిరాపార్క్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు గత కొంత కాలంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి సంత జరిగే బుధవారం నాడు ప్రధాన రహదారిపై అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొని ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ మార్గం గుండానే భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న మెతుకుసీమ గర్జన పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలోనూ ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ స్వయంగా అనుభవించారు. ఆయన వాహన శ్రేణిని బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకు సీమగర్జన సభలో ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్అండ్బీ అధికారులకు పనులను పురమాయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్, సిద్దిపేట ఈఈ బాల్‌నర్సయ్య, గజ్వేల్ శాఖ డిప్యూటీ ఈఈ బాల్‌నర్సయ్య తదితరులు సోమవారం పట్టణంలో సర్వే చేపట్టారు. అధికారుల కథనం ప్రకారం పట్టణంలోని 133/33కేవీ సబ్స్టేషన్నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్కళశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు స్థల పరిశీలన జరిపారు. ఈ క్రమంలో నగరపంచాయతీ పరిధిలోని క్యాసారంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ముఖ్యనేతలు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్ టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆకుల దేవేందర్ తదితరులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తానికి గజ్వేల్‌లో రింగ్‌రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.