రోడ్డున పడమంటారా?
150 ఫీట్లు విస్తరిస్తే ఇళ్లన్నీ కోల్పోతాం
కొత్త మార్కింగ్ వద్దే వద్దు
కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును 100 ఫీట్లే విస్తరించాలి
రోడ్డుకిరువైపులా కుటుంబాల డిమాండ్
కొలతలేస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులు
రోడ్డు విస్తరణ రగడ రాజుకుంటోంది. 100 ఫీట్ల విస్తరణ కాస్త.. సీఎం ఆదేశాలతో 150 ఫీట్లకు పెరగనుంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్ల వారు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నారు. ఇష్టారీతిన మార్కింగ్‌తో ఇప్పటికే నష్టపోతున్నామని, తాజాగా 150 ఫీట్లంటే ఒప్పుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. తమ అభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని స్పష్టంచేస్తున్నారు.
వరంగల్ రూరల్: కేయూసీ-పెద్దమ్మగడ్డ రహదారి విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నగరంలో రహదారులను 150ఫీట్ల మేరకు విస్తరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రోడ్లు-భవనాల శాఖ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. కేయూసీ-రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ. 8 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఇటీవల విస్తరణ పనులు ప్రారంభించారు. రోడ్డుకు ఇరుపక్కల తవ్వి బేస్‌గ్రావెల్ వేసి పనులు చేయిస్తున్నారు. నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు మధ్య భాగం నుంచి ఇరుపక్కల 50 ఫీట్లు ఉండేలా మార్కింగ్ చేశారు. కానీ ఇలా అన్నిచోట్ల చేయలేదని, కొందరు పలుకుబడితో తమ వైపు 35 ఫీట్ల వరకే స్థలాన్ని అప్పగిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మాజీ కార్పొరేటర్ తన స్థలం పోకుండా ఉండేందుకే అధికారులతో తప్పుడు మార్కింగ్ చేయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారికి ఇరుపక్కల ఒకే విధంగా మార్కింగ్ చేయాలని అధికారులను ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
అలా చేస్తే భవనాలకు ముప్పు..
కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును 150ఫీట్ల మేరకు విస్తరిస్తే పలు భవనాలు కూల్చేసే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లుగా కేయూసీ-పెద్దమ్మగడ్డ ఉంది. అందుకే స్థానికులు తమ ఇళ్లను నిబంధనల మేరకు స్థలం విడిచిపెట్టి నిర్మించుకున్నారు. రోడ్డుకిరువైపులా 50 ఫీట్లు ఉండేలా మార్కింగ్ చేస్తే కొన్ని పాత ఇళ్లు కూల్చివేతలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇక 150ఫీట్లుగా నిర్ధారిస్తే మొత్తం గృహాలు కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. రెండు రోజులుగా ఆర్‌అండ్‌బీ అధికారులు ఇరుపక్కల 75 ఫీట్లు కొలిచి మార్కింగ్ చేస్తుండడంతో స్థానికులు ఆందోళనలకు గురవుతున్నారు. మొదట ప్రకటించిన ట్లుగా ఈ రహదారిని నాలుగు లేన్లుగా 100 ఫీట్లకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
150 ఫీట్లు వద్దేవద్దు..
కేయూసీ-పెద్దమ్మగడ్డ రోడ్డును మాస్టర్ ప్లాన్‌లోని ఆర్‌డీపీ(రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్)లో ఉన్నట్లుగానే అభివృద్ధి చేయాలి. అధికారంలో ఉన్నం కదా అని ఇష్టానుసారం చేస్తే ఎలా? రోడ్డును 150 ఫీట్లకు విస్తరిస్తామని అనడం సరికాదు.
- దాసరి రమేష్, రెడ్డి కాలనీ
ఇరుపక్కల సమానంగా విస్తరించాలి
రహదారిని అభివృద్ధి చేసేందుకు ఇరు పక్కల సమానంగా మార్కింగ్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా.. కొన్ని చోట్ల ఎక్కువగా మార్కింగ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు పరిశీలన చేసి మొత్తం ఒకేలా ఉండేలా చూడాలి.
- రవికుమార్, స్థానికుడు
మార్కింగ్‌లపై ఆందోళనలు తప్పవు
పెద్దమ్మగడ్డ రోడ్డును 100నుంచి 150 ఫీట్లు వెడల్పు చేసేందుకు చేస్తున్న మార్కింగ్‌లపై ఆందోళనలు నిర్వహిస్తాం. 50 ఫీట్లు పెంచడం వల్ల నివాసాలు లేకుండా పోయి పరిస్థితులు ఏర్పడుతాయి. అందరి పరిస్థితులను పరిశీలించి న్యాయం చేయాలి.
- కె.రమేష్, యాదవనగర్