ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్వాకం
మంత్రి జిల్లాలోనే నిబంధనలకు తూట్లు
అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణం
ఇక్కడ నిబంధనలు చెల్లవు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే అధికారులు నడుచుకోవాలి. స్వయంగా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి సొంత జిల్లా కావడంతో నిబంధనలు కూడా వారికి అనుకూలంగా తిరగ రాసేసుకుంటున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు అమలు చేసేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో అన్నిచోట్ల నిబంధనలు తుంగలోతొక్కి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మిగిలిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నా ఫలితం లేకుండా పోతోంది.
-సాక్షి ప్రతినిధి, ఒంగోలు
నిబంధన ఇలా : ఎక్కడైనా టెండర్లు పిలిస్తే బిడ్ దాఖలు చేసేందుకు కాంట్రాక్టర్‌కు కనీస గడువు ఉంటుంది. పద్ధతిగా టెండర్లయితే పదిహేను రోజులు, అత్యవసర టెండర్లయితే మూడు నుంచి ఏడు రోజుల వరకూ గడువిస్తారు. అయితే మామూలు మరమ్మతు పనులకు జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులు ఇచ్చిన సమయం ఎంతో తెలిస్తే ఓ గంట మాత్రమే.
తుంగలో ఇలా: గంటలోనే టెండర్లు వేయాలంటూ
కొత్త నిబంధన అధికార పార్టీ రచించింది. లేకపోతే ఆన్‌లైన్ బిడ్ క్లోజ్ అయిపోతుందని హెచ్చరిస్తోంది. ఇదీ కనిగిరి ఆర్‌అండ్‌బీ డివిజన్‌లో అవలంబిస్తున్న కొత్త ఎత్తుగడ. ముందుగానే ఎమ్మెల్యే మనుషులకు చెప్పి ఫలానా టెండర్‌కు ఈఎండీ కోసం డీడీలు తీసి సిద్ధం చేయిస్తారు. అకస్మాత్తుగా ఉదయం 10.30 గంటలకు ఆన్‌లైన్‌లో టెండర్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా గంట తర్వాత బిడ్ క్లోజ్ చేస్తారు. ఈలోగానే బిడ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించుకున్నవారు మాత్రమే దీనిలో టెండర్లు
వేయడానికి వీలవుతుంది.
వివరాలు లేకుండానే : లక్ష రూపాయలకు మించిన ఏ పనైనా ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీని ప్రకారం బుధవారం ఉదయం కనిగిరి డివిజన్‌కు సంబంధించి రెండు రోడ్లను మరమ్మతులు చేయడానికి రూ.9.41 లక్షలు అంచనా విలువతో టెండర్లు పిలిచారు. దీనికి బిడ్ సెక్యూరిటీగా రూ.9,500 నిర్ణయించారు. కనీసం ఏ రోడ్లు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ మరమ్మతులు చేయాలన్న కనీస వివరాలు కూడా లేకుండానే ఆన్‌లైన్ టెండర్లు పిలిచారు. మరో టెండర్ కందుకూరు, పామూరు రోడ్డు, దొనకొండ - కనిగిరి - దోర్నాల రోడ్డు మరమ్మతుల కోసం రూ.3.93 లక్షలు పిలిచారు. దీనికి కూడా కేటాయించిన సమయం గంట మాత్రమే. ఇటీవల కాలంలో కనీసం ఎనిమిది టెండర్లను ఇదే పద్ధతిలో పిలిచినట్లు సమాచారం. దీనిపై అధికారుల వివరణ కోరగా తాము నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, దీన్ని ఎందుకు వివాదం చేస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం ఉంటే వారికి అనుకూలంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, తమ ఇబ్బందులు అర్థం చేసుకోవాలని ఆ అధికారి చెప్పుకొచ్చారు.
అనుకూలంగా ‘గంట’ కొట్టేస్తున్నారు
Published Thu, Jul 23 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement
Advertisement