ఇప్పటంలో ప్రహరీని మాత్రమే కూల్చిన దృశ్యం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది. తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు ఎవరెవరు స్థలాలిచ్చారో అదే రోజు వేదికపైనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు అధికారులు తొలగించిన ఆక్రమణల జాబితాలో వారెవరూ లేకపోవడం గమనార్హం.
తొమ్మిది మంది సభకు స్థలాలు ఇచ్చినట్లు నాడు జనసేన ప్రకటించగా అందులో ఒక్కరికి మాత్రమే అధికారులు ఆక్రమణల కింద నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారి ఇళ్లు, దుకాణాలు రోడ్డుకు దరిదాపుల్లోనే లేవు. అయితే ఆ ఇంటి యజమాని కూడా ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అధికారులు ఆ నివాసాన్ని వదిలేసి మిగిలిన ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతల ఆరోపణలు బెడిసికొట్టడంతో మార్చిలో నిర్వహించిన జనసేన ప్లీనరీకి 31 మంది భూములిచ్చారని, వారి ఇళ్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.
పార్కింగ్‌కు వాడుకుని..
ఇప్పటంలో ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు మార్కింగ్ చేసినప్పుడు మొత్తం 53 ప్రైవేట్ ఆస్తులు, ఒక పంచాయతీ భవనం ఆక్రమణల పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31 మంది తమ ప్లీనరీకి భూములిచ్చిన సానుభూతిపరులంటూ జనసేన బుకాయిస్తోంది. నిజానికి వీరి భూములు సభ జరిగిన ప్రాంతాన్ని ఆనుకుని ఉండటం, ఆ సమయంలో పొలాల్లో ఎలాంటి పంటలు లేకపోవడంతో ప్లీనరీ వాహనాల పార్కింగ్‌గా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా వారి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వాడుకోవడం గమనార్హం.
సభకు భూములిచ్చింది 9 మందే..
ఇప్పటంలో జనసేన సభకు భూములిచ్చిన తొమ్మిది మందికి సర్వే నం.167, 167(బి)లో పొలాలున్నాయి. సభ నిర్వహణకు వారు అంగీకరిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్‌కు అర్జీ అందింది. జనసేన నేతలు చెబుతున్న 31 మంది పొలాలు సమీపంలోనే ఉన్నా అనుమతి తీసుకోలేదు. స్థానిక టీడీపీ నాయకుడైన శంకరశెట్టి పిచ్చయ్య గతంలో సర్పంచ్‌గా పని చేశారు. తర్వాత ఆయన భార్య కూడా సర్పంచ్‌గా ఉన్నారు.
జనసేన సభకు పొలాలు ఇచ్చిన 9 మందిలో ఆయన ఇల్లు మాత్రమే రోడ్డును ఆనుకుని ఉంది. ఆయన ఇంటి ప్రహరీ, మెట్లు ఆక్రమణ పరిధిలోకి రావడంతో అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై ఆయన జూన్‌లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో పిచ్చయ్య ఇంటి ప్రహరీని అధికారులు తొలగించలేదు.
గతంలోనే విగ్రహ తొలగింపు ప్రక్రియ
ఇప్పటంలో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పరిధిలోకి 53 ప్రైవేట్ ఆస్తులు, రెండు దేవాలయాలు, మరో రెండు వైఎస్సార్ విగ్రహాలు వచ్చాయి. వీటిలో ఒక విగ్రహ తొలగింపు ప్రక్రియ గతంలోనే చేపట్టి రెయిలింగ్, దిమ్మె తొలగించారు. మరో ప్రాంతానికి తరలించే లోగా జనసేన రాద్దాంతం సృష్టించింది. ఆ విగ్రహాన్ని సోమవారం తరలించారు. మరో విగ్రహాన్ని రోడ్డు పనులు ప్రారంభించే లోగా తరలించాలని నిర్ణయించారు.
జనసేన సభకు భూములిచ్చిన వారి వివరాలు
1. వింటా సాంబిరెడ్డి (సర్వే నం.167(బి): సొంతూరు గన్నవరం సమీపంలోని తేలప్రోలు కాగా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి వెనుక ఉన్న వజ్ర రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఎండు చేపల వ్యాపారం చేసే ఈయన ఇప్పటంలో ఏడెనిమిదేళ్ల క్రితం పొలం కొనుక్కున్నారు. ఇప్పటంలో ఎలాంటి నివాసం లేదు.
2. లక్కాకుల ఆదినారాయణ: ఈయన నివాసం ఊరు మధ్యలో ఉంది.
3. తిరుమలశెట్టి సామ్రాజ్యం: లక్కాకుల ఆదినారాయణ సోదరి. చీరాలలో ఉంటారు. ఈమెకు ఇప్పటంలో సొంతిల్లు లేదు.
4. గాజుల సాబయ్య: ఈయన ఇల్లు కూడా ఆదినారాయణ ఇంటికి సమీపంలోనే ఊరికి మధ్యన ఉంది.
5. శంకరశెట్టి శ్రీనివాసరావు: (పిచ్చయ్య తమ్ముడు) గుంటూరులో ఉంటారు. వారసత్వంగా వచ్చిన ఇల్లు గ్రామంలో ఉంది.
6. శంకరశెట్టి పిచ్చయ్య: ఈయన ఇల్లు పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉంది. ప్రహరీతో పాటు ఇంటి మెట్లు ఆక్రమణల పరిధిలోకి వచ్చాయి. ఏప్రిల్, మేలో నోటీసులు ఇవ్వడంతో జూన్‌లో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అధికారులు ఈయన ఆస్తిని ముట్టుకోలేదు.
7. శంకరశెట్టి రాయుడు, 8. శంకరశెట్టి ఉమామహేశ్వరరావు, 9. గాజుల నర్సియ్య: వీరి నివాసాలు గ్రామంలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment