ఇజ్రాయెల్, పాలస్తీనాలు ‘రెండు దేశాలుగా బతకడమే దారి’ అనే శీర్షికతో వ్యాసం రాసిన (అక్టోబర్ 23న) ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ కొన్ని వాస్తవాలను విస్మరించారు లేదా తప్పుగా పేర్కొన్నారు. రెండు స్వతంత్ర దేశాలను ప్రతిపాదించిన 1993 నాటి నార్వే (ఓస్లో) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి సంతకం చేయగా అందుకు హమాస్, ఇరాన్ నిరాకరిస్తున్నాయన్నారు. ఆ ఒప్పందం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) అధ్యక్షునిగా యాసిర్ అరాఫాత్‌కు, ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్‌కు మధ్య జరిగింది.
తర్వాత అరాఫాత్ 2004లో మరణించే వరకు 11 ఏళ్లపాటు అది అమలు కాకపోవటానికి కారణం ఎవరు? ఓస్లో ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలూ మొదటిసారిగా పరస్పరం గుర్తించుకున్నాయి. కానీ అది ఆ కాలంలో గానీ, ఈరోజుకు గానీ అమలు కాకపోవటానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్‌దేనని... స్వయంగా ఆ చర్చలకు సాక్షి అయిన ఆరన్ డేవిడ్ మిల్లర్ అనే అమెరికాకు చెందిన అగ్రస్థాయి నిపుణుడు, అమెరికా నుంచే వెలువడే ‘ఫారిన్ పాలసీ’ అనే సుప్రసిద్ధ జర్నల్‌లో ఇటీవలే రాశాడు. అంతేకాదు, ఆ ఒప్పందంలో అసలు ‘పాలస్తీనా దేశం’ అన్న మాటే లేదని వెల్లడిస్తూ, 1993 నుంచి ఆ మాత్రపు ఒప్పందాన్ని అయినా ఇజ్రాయెల్ ఎట్లా ఉల్లంఘిస్తూ వస్తున్నదో వర్ణించి చెప్పాడు.
వ్యాస రచయిత ప్రస్తావించిన వాటిలో మరొకటి మాత్రం చూద్దాము. అరాఫాత్ మరణం తర్వాత పీఎల్‌ఓ లేదా ఫతా పార్టీ నాయకత్వం పాలస్తీనా అథారిటీ (పీఏ) పేరిట పాలిస్తూ పూర్తి నిష్క్రియాపరంగా, అవినీతిమయంగా మారినందు వల్లనే, అంత వరకు కేవలం నామమాత్రంగా ఉండిన హమాస్, బాగా బలం పుంజుకుని 2006 నాటి ఎన్నికలలో గెలిచి 2007లో అధికారా నికి వచ్చింది. ఆ పరిణామం ప్రజాస్వామిక ఎన్నికలలో జరిగిందే తప్ప బలప్రయోగంతో కాదు.
ఇక ఇజ్రాయెల్ 1947 నుంచి మొదలు కొని ఈ 77 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయ స్థానంతో పాటు అనేకానేక ఇతర ప్రపంచ సంస్థలను, ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరిస్తూ ఈరోజున గాజాలో, వెస్ట్ బ్యాంక్‌లో ఏ వ్యూహాన్ని అమలు చేసి అసలు పాలస్తీనా అన్నదే లేకుండా చేయ జూస్తున్నదో కనిపిస్తున్నదే.
– టంకశాల అశోక్
సీనియర్ సంపాదకుడు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment