
ఇజ్రాయెల్ కేబినెట్ సిఫార్సు
జెరూసలేం: గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది. కాల్పుల విరమణకు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం సిఫార్సు చేసింది. దీంతో ఈ ఒప్పందం ఫుల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కోర్టులోకి చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది.
15 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. వారంతా స్వదేశానికి చేరుకుంటారు. కాల్పుల విరమణ కోసం ఖతార్, అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించాయి. హమాస్‌తోపాటు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఒప్పించాయి.
గాజాలో దాడులకు స్వస్తిపలకడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించాయి. అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. కనీసం 72 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది. గాజా ప్రజలు, బందీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒప్పందాన్ని అమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.