
గాజా:ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఈజిప్టు రాజధాని కైరోలో శనివారం(నవంబర్30) నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలపై ఈజిప్టు అధికారులతో వారు చర్చలు జరుపుతారని తెలిపారు.
హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరులు విడుదల తర్వాతే కాల్పుల విరమణపై ఆలోచిస్తామని ఇజ్రాయెల్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హెజ్‌బొల్లా,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. హమాస్ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుగొంటామని,ఇందుకు ఖతార్,టర్కీ,ఈజిప్టు దేశాల సాయంతో ప్రయత్నిస్తామని అమెరికా ఇప్పటికే పేర్కొనడం గమనార్హం.
గతేడాది అక్టోబర్7న హమాస్ ఉగ్రవాదులు ఇజజ్రాయెల్‌పై దాడి చేసి వందల మంది ఆ దేశ పౌరులను చంపడమే కాకుండా కొందరిని తమతో పాటు బందీలుగా తీసుకెళ్లారు.అక్టోబర్ 7 తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు పాలస్తానాలో 40వేల మందికిపైగా మరణించారు.