సీఆర్‌పీఎఫ్‌లో మహిళలకు 33%
న్యూఢిల్లీ: పారామిలటరీ దళాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)ల్లో కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో ఇకపై మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. అలాగే, సరిహద్దుల రక్షణ బాధ్యతలు నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)ల్లోని కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో 15% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.
తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం లభించిందని మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దళాల్లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది సాయుధ సైనికులు ఉండగా, వారిలో 20 వేల మంది మాత్రమే మహిళలు. ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌లో 6300 మంది మహిళలే ఉన్నారు. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్‌పీఎఫ్‌ను వినియోగిస్తారు.