Indian Airports Alerted About Anonymous Sudan Attacks On India, Details Inside - Sakshi
Sakshi News home page

Anonymous Sudan Attacks: ‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్‌ సూడాన్‌’

Published Sat, Apr 15 2023 3:29 AM | Last Updated on Sat, Apr 15 2023 3:19 PM

Anonymous Sudan Attacks on India - Sakshi

ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్‌ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్‌ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్‌ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్‌ సూడాన్‌’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్‌కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్‌ సెక్యూరిటీ సంస్థ రెడ్‌వేర్‌ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్‌ సూడాన్‌’గ్రూప్‌ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్‌ చేస్తున్నామని ఈ గ్యాంగ్‌ ప్రచారం చేసుకుంటోంది.

కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్‌ ప్రపంచానికి సైబర్‌ సవాల్‌ విసరడానికే తమ ‘ఆపరేషన్స్‌’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్‌ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్‌ను టార్గెట్‌ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్‌సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. 

ట్విట్టర్‌ ద్వారా ప్రకటించి మరీ...
అనానిమస్‌ సూడాన్‌ గ్యాంగ్‌ తాము ఏ దేశాన్ని టార్గెట్‌ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్‌ ఖాతా హ్యష్‌ట్యాగ్‌ అనానిమస్‌ సూడాన్‌లో ‘ఆఫ్టర్‌ ఫ్రైడే.. ఇండియా విల్‌ బీ ది నెక్ట్స్‌ టార్గెట్‌’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి జరిగింది.

అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్‌సైట్లపై ఈ–ఎటాక్స్‌ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్‌క్రైమ్‌ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నో డిమాండ్స్‌... కేవలం సవాళ్లే 
సాధారణంగా సైబర్‌ ఎటాక్స్‌ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్‌కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్‌వేర్‌ ఎటాక్స్‌ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ.

అయితే అనానిమస్‌ సూడాన్‌ ఎటాకర్స్‌ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను ఎటాక్‌ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్‌ ప్రపంచాన్ని సవాల్‌ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్‌ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్‌ సూడాన్‌ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు.  

డాక్స్‌ ఎటాక్స్‌తో సర్వర్లు క్రాష్‌
ఇతర మాల్‌వేర్స్, హాకర్ల ఎటాక్స్‌కు భిన్నంగా అనానిమస్‌ సూడాన్‌ ఎటాక్స్‌ ఉంటున్నాయి. డీ డాక్స్‌గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్‌ డినైయెల్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌కు దాని సర్వర్‌ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్‌ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్‌ వస్తే కుప్పకూలిపోతుంది.

పరీక్షల రిజల్ట్స్‌ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్‌సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్‌ సూడాన్‌ ఎటాకర్స్‌ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్‌ చేసిన వెబ్‌సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్‌ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్‌ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేని సర్వర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్‌సైట్‌ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

‘హ్యాక్టివిస్ట్‌ ఇండోనేసియా’తోనూ ముప్పు 
ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్‌ సూడాన్‌’ఎటాక్స్‌ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్‌ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్‌ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్లను టార్గెట్‌ చేసినట్లు ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది.

ఐ4సీ పరిధిలోని సైబర్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్‌ ఆఫ్‌ సర్వీస్‌ (డీఓఎస్‌), డిస్ట్రిబ్యూటెడ్‌ డినైయెల్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ (డీ–డాక్స్‌) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్‌సైట్స్‌ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్‌సైట్లు వారి టార్గెట్‌ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది.

గతేడాది ఢిల్లీ ఎయిమ్స్‌ జరిగిన సైబర్‌ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్‌ ఎటాక్‌గా ఈ గ్రూప్‌ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్‌ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్‌సైట్లను సైబర్‌ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది.  

ఉమ్మడిగా పని చేస్తే కట్టడి 
అనానిమస్‌ సూడాన్‌ ఎటాక్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్‌ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్‌లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్‌ వాల్స్‌ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్‌ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి.  – రాజేంద్రకుమార్, సైబర్‌ నిపుణుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement