కసాయి పాలకుడు
దక్షిణాఫ్రికా ఖండపు తూర్పుభాగంలోని సూడాన్, కాంగో, టాంజానియా, కెన్యా, ఇథియోపియాల నడుమ ఉన్న చిన్న దేశం ఉగాండా. ఆ దేశానికి 1962లో బ్రిటిష్‌వారి నుంచి స్వాతంత్య్రం వచ్చింది. అంతలోనే 1971లో ఆ స్వాతంత్య్రం చేజారిపోయింది! అయితే దాన్ని చేజిక్కించుకున్నవాడు ఎవరో పరాయిదేశ పాలకుడు కాదు. వాళ్ల మనిషే. పేరు ఇడీ అమీన్! అప్పటికి ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు మిల్టన్ ఒబోటే. అతడి ప్రభుత్వంలో అమీన్ ఒక సైనికాధికారి.
ఒబోటే, అమీన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులంటే ఇద్దరూ కలిసి బంగారం స్మగ్లింగ్ చేసేవారు. కాంగో నుంచి ఏనుగు దంతాలను, కాఫీ గింజలను పెద్ద ఎత్తున అక్రమంగా తెప్పించుకుని వ్యాపారం చేసేవారు. వసూళ్లను పంచుకునేవారు. ఆ క్రమంలో 1971 జనవరి 25న ఒబొటే సింగపూర్‌లో ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అదే అదనుగా అమీన్ సైనిక తిరుగుబాటు లేవనెత్తాడు. ఒబొటే ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.
ఉగాండా అధ్యక్షుడిగా, సైనికదళాల ముఖ్య అధికారిగా ఉగాండా పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి 1979 ఏప్రిల్ 13న టాంజానియా సేనల తిరుగుదాడికి జడిసి దేశాన్ని వదిలి పారిపోయేవరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన పాలనను ఉంగాండా ప్రజలకు తొమ్మిదేళ్లపాటు నరకం చూపించాడు ఇడీ అమీన్.
అమీన్ అధికారంలో వచ్చీ రావడంతోనే, అంతకుముందు ఒబొటే ఖైదు చేయించిన రాజకీయ నాయకులందరినీ విడుదల చేయించి వారిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఒబొటే మద్దతుదారులందరినీ వెంటాడి, వేటాడి చంపేందుకు ‘కిల్లర్ స్క్వాడ్స్’ని ఏర్పాటు చేశాడు. పాత్రికేయులు, న్యాయవాదులు, విద్యార్థులు, సీనియర్ అధికారులు... వారూ వీరు అని లేకుండా తన ను విమర్శించిన వారందరినీ హత్య చేయించాడు.
1972లో ‘ఆర్థిక యుద్ధం’ పేరుతో ఉగాండాలోని ఆసియా సంతతి వాళ్లందరినీ దేశం నుంచి వెళ్లగొట్టాడు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుందని తెలిసినా అతడు లెక్క చేయలేదు. చివరికి ‘ఉగాండా కసాయి’గా పేరుమోశాడు. అమీన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కనీసం 3 లక్షల మంది పౌరులు అతడి వివక్షకు, వైషమ్యాలకు బలయ్యారు. 1976లో ఎంటెబ్బేకు బయల్దేరిన ఫ్రెంచి విమానాన్ని హైజాక్ చేయించాడు. 1978 అక్టోబరులో టాంజానియా ఆక్రమణకు తన సొంత సేనల్ని ఉసిగొల్పాడు.
అదే అతడి అంతానికి కారణమయింది. అమీన్‌కు వ్యతిరేకంగా ఉగాండా జాతీయవాదులు టాంజానియా సేనలకు సహకరించడంతో వారు ఉగాండా సేనలపై పైచేయి సాధించారు. వాళ్లకు చిక్కకుండా అమీన్ మొదట లిబియా పారిపోయాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా చేరుకున్నాడు. అలా రెండు దశాబ్దాలకుపైగా అజ్ఞాతంలో గడిపి, ఆరోగ్యం క్షీణించి, కోమాలోకి జారుకుని 2003 ఆగస్టు 16న మరణించాడు. ఉగాండా ప్రభుత్వం అతడి మృతదేహాన్ని అడిగేలోపే సౌదీ అరేబియా ఖననం చేయించింది. విచిత్రం ఏమిటంటే అమీన్ దురాగతాలపై ఈనాటికీ ఏ దేశమూ విచారణ జరిపించకపోవడం!
ఇడీ అమీన్‌ను సమర్థించేవారు కఠోరమైన అతడి బాల్యమే అతడిని అంతటి క్రూర పాలకునిగా మార్చిందని అంటారు. అమీన్ జన్మదినం ఎక్కడా నమోదు కాలేదు. సంవత్సరం మాత్రం 1925 అంటారు. ఉగాండాలోని ఉత్తర నైలు ప్రావిన్సులో అతడు జన్మించాడు. 1940 నుంచి 1970 వరకు సైన్యంలో పనిచేశాడు. ప్రభుత్వాన్ని పడగొట్టి, అధ్యక్షుడు అయ్యాడు.
అమీన్ తల్లి మూలికా వైద్యురాలు. దైవభక్తి పరాయణురాలు. తండ్రి తన తల్లిని వదిలిపెట్టి వెళ్లడంతో ఆ కోపం, అసహనం, దుఃఖం అమీన్‌ని చెడ్డ పిల్లవాడిగా మార్చాయని అతడిని సమర్థించేవారు చెబుతారు. అమీన్ పెద్దగా చదువుకోలేదు. చిన్న వయసులోనే బ్రిటిష్ సైన్యంలోని ‘బ్లాక్ ఆఫ్రికన్’ విభాగంలో చేరాడు. ఆ తర్వాత కొంతకాలం అక్కడే వంటవాడిగా పనిచేశాడు.
అమీన్ పొడగరి. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉండేవాడు. బాక్సింగ్, స్విమ్మింగ్ ఛాంపియన్ కూడా. సైన్యంలో త్వరత్వరగా ఎదగడానికి సైనిక విచారణల్లో అమానుషంగా ప్రవర్తించేవాడు. అలా తన ‘శక్తి సామర్థ్యాలను’ చాటుకొని అక్రమ విధానాల్లో పైకి వచ్చినవాడు ఇడీ అమీన్. చరిత్ర క్షమించని నరహంతకులలో ఇడీ అమీన్ ఒకరు.