ఢిల్లీ: అదొక చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌స్ట్రిప్. కమ్యూనికేషన్‌లో భాగంగా.. నావిగేషనల్ అప్రోచ్ సహకారం లేదు. అక్కడ ఫ్యూయల్ సౌకర్యమూ లేదు. రాత్రి పూట ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోటు అది. ల్యాండింగ్ లైట్లు కూడా లేని చోటు నుంచి జనాల్ని తరలించే ఆపరేషన్ సక్సెస్‌గా పూర్తి చేసింది భారత వైమానిక దళం. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసే దమ్ము ఉందని మరోసారి నిరూపించుకుంది.
సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది.
అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ (Night Vision Goggles) సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రా-రెడ్ సెన్సార్‌లను ఉపయోగించి ఎలాంటి ఆటంకాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే.. అంత చిన్న రన్‌వేలో ఎయిర్‌క్రాఫ్ట్ దించగలిగారు.
ల్యాండింగ్ అయ్యాక కూడా ఇంజిన్లను ఆన్‌లోనే ఉంచి.. అక్కడున్నవాళ్లను, వాళ్ల లగేజీలను విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ యూనిట్ గరుడకు చెందిన ఎనిమిది మంది కమాండోలు ప్యాసింజర్ల భద్రతను పర్యవేక్షిస్తూనే.. సురక్షితంగా ఎక్కించారు. విమానం ఎలాగైతే దిగిందో.. అదే తరహాలో ఎన్‌వీజీ ఉపయోగించి టేకాఫ్ చేశారు. అలా రెండున్నర గంటలపాటు ఈ రిస్కీ ఆపరేషన్ కొనసాగింది. కల్లోల రాజధాని ఖార్తోమ్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా చోటుచేసుకోవడం గమనార్హం. అంతా జెడ్డాకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటిదాకా 1,360 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం.
ఇదీ చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు! 110 ఏళ్ల తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment