
కైరో: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిని అదుపులోకి తీసుకున్న సైన్యం..దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు గడువు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశ పరిపాల నాబాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ (సావరిన్) కౌన్సిల్‌ను రద్దు చేయడంతోపాటు ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్‌ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా బుర్హాన్ చేసిన ప్రకటన టీవీ చానెళ్లలో ప్రసారమైంది. రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల వల్లే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా తెలిపారు.
సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. సైనిక తిరుగుబాటు వార్తలతో ఆగ్రహించిన ప్రజలు పెద్ద సంఖ్యలో రాజధాని ఖార్తూమ్ వీధుల్లోకి చేరుకున్నారు.టైర్లకు నిప్పుపెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్‌ను పదవి నుంచి తొలగించాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టేందుకు మిలటరీ అధికారులు, పౌర నేతలతో ఉన్నత స్థాయి కౌన్సిల్ ఏర్పాటుతోపాటు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించారు. ప్రజా ప్రభుత్వా నికి నవంబర్‌లో అధికారం అప్పగించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment