ఖార్తోమ్: సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు.
గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు.
ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది.
శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అగాధంలోకి సూడాన్..
సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.
పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్‌తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే!
Comments
Please login to add a commentAdd a comment