సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ తన ఉధారతను మరోసారి చాటుకున్నారు. వరద తాకిడికి అతలాకుతమైన సూడాన్కు తక్షణమే రూ.10 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థికసాయం అందజేయాలని అబ్దుల్ల బిన్ సౌదీ ఉన్నతాధికారులను ఆదేశించారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.
ఇటీవల సూడాన్ దేశంలో వరదలు పోటెత్తాయి. దీంతో ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి. దాంతో సూడాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయ పునరావాస చర్యలు కల్పించేందుకు సౌదీ ఆ నగదు మొత్తాన్ని సూడాన్కు అందజేయనుంది.
అలాగే నిత్య ఘర్షణలతో ఈజిప్టు అతలాకుతలమవుతుంది. ఆ ఘర్షణలలో గాయపడిన వేలాది మంది ఈజిప్టులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సాయం అందించేందుకు స్థానిక వైద్యులను త్వరలో ఈజిప్టు పంపేందుకు చర్యలు తీసుకోవాలని సౌదీ రాజు ఆదేశాలు జారీ చేశారని స్థానిక మీడియా తెలిపింది. అందుకోసం స్థానిక వైద్య బృందాలతోపాటు మందులు, ఔషధాలను ఈజిప్టు పంపేందుకు సౌదీ ఉన్నతాధికారులు ముమ్మర చర్యలు చేపట్టారని స్థానిక మీడియా వివరించింది.