ప్రతీకాత్మక చిత్రం
కసాల(సూడాన్) : మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అగంతకుడి కత్తి దాడిలో ముగ్గురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సూడాన్‌లోని కసాల నగరంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కసాల నగరంలోని ఓ మసీదులో సాయంకాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవ్వరూ తనకు బదులు చెప్పకపోవడంతో ఆగ్రహించిన దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రార్థన చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు.
ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొంత సమయం తర్వాత తేరుకున్న అక్కడి వారు ఆ దుండగుడిపై దాడిచేసి చంపేశారు. గాయాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కసాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, వందల మంది సూడాన్ సైనికులు నగరాన్ని మోహరించినా ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment