UN General Assembly summit
-
సంపన్న రాజ్యాల కపటత్వం
‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు. అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే. కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు. అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది. సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది. 2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది. అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి. ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి. ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం! -
కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం
వాషింగ్టన్/మాడ్రిడ్/రోమ్/బ్రిటన్/జెనీవా: ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఇల్లు కదలడం లేదు. స్పెయిన్, అమెరికా, బ్రిటన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 188 దేశాల్లో కరోనా విస్తరించడంతో ప్రపంచమే చిగురుటాకులా వణికిపోతోంది. కేసుల సంఖ్య 10 లక్షల 50 వేలకి చేరువలో ఉంటే, మృతుల సంఖ్య 55 వేలు దాటేసింది. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కరోనాను తరిమికొట్టాలని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని రూపొందించింది. తీవ్రంగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం కలిగిస్తున్న కోవిడ్–19పై యూఎన్ తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. ‘‘కోవిడ్–19 వ్యాధిపై పోరాటానికి ప్రపంచ దేశాల సంఘీభావం’’అన్న పేరుతో రూపొందించిన ఈ తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇంకా చర్చించాల్సి ఉంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతపై ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని తీర్మానం పేర్కొంది. ఎక్కడివారక్కడే ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అసాధారణంగా చూపిస్తున్న ప్రభావం, చాలా మంది జీవనోపాధిని కోల్పోవడంతో వీటిపై అందరూ సమష్టిగా పోరాటం చేయాలని ఆ తీర్మానం పేర్కొంది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మానవ హక్కులు, ప్రజలు ఎదుర్కొనే ఒత్తిళ్లను గౌరవించాలని, ఎలాంటి వివక్ష తావులేకుండా అన్ని దేశాలు పని చేయాలని పేర్కొంది. ట్రంప్‌కు కరోనా నెగెటివ్.. 15 నిమిషాల్లోనే ఫలితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రెండోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైట్ హౌస్ ఊపిరిపీల్చుకుంది. అత్యంత ఆధునిక కరోనా ర్యాపిడ్ పాయింట్ కిట్‌తో నిర్వహించిన ఈ వైద్య పరీక్షలో ఫలితం కేవలం 15 నిమిషాల్లోనే వచ్చిందని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు సీన్ కోన్లీ చెప్పారు. శాంపిల్ కలెక్షన్‌కి ఒక్క నిమిషం పడితే మరో పావుగంటలోనే ఫలితం తేలిందన్నారు. నెలరోజులు ఇల్లు కదలొద్దు అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్లందరూ మరో నాలుగు వారాలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరానికి మించిన పరిష్కార మార్గం లేదని అన్నారు. ‘‘దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలి. స్వీయ నియంత్రణ మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇల్లు కదలకుండా ఉండండి. మరో నెల రోజులు ఇలా చేస్తే మనం కరోనాపై యుద్ధంలో గెలుస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించండి’’అని ప్రజలకు ఆయన హితవు పలికారు అమెరికాలో కేసుల సంఖ్య 2 లక్షల 35వేలు దాటిపోగా, ఇప్పటివరకు 5,800 మంది ప్రాణాలు కోల్పోయారు. గాలి ద్వారా వ్యాపించదు కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే ఈ వైరస్ సోకుతుందని తన తాజా మ్యాగజైన్లలో స్పష్టం చేసింది. ఈ తుంపర్లు ఏదైనా వస్తువులపై పడితే వాటినుంచి కూడా మనుషులకు సోకుతుందని తెలిపింది. ఇటీవల కాలంలో కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ విషయంపై వివరణ ఇచ్చింది. చైనాలో 75 వేల మంది కరోనా వ్యాధిగ్రస్తుల్ని పరిశీలించిన తర్వాత ఈ విషయంపై ఒక నిర్ధారణకు వచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ► బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనాతో ఇంకా బాధపడుతున్నారు. తనకు ఇంకా జ్వరం తగ్గలేదని అందుకే నిర్బంధంలోనే ఉన్నానని సోషల్ మీడియా వేదికగా జాన్సన్ వెల్లడించారు. ► కరోనా కోరల్లో చిక్కుకొని జర్మనీ విలవిల్లాడుతోంది. చైనాను మించిపోయేలా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజుల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తంగా కేసుల సంఖ్య 84 వేలు దాటేసింది. ఇక గురువారం ఒక్క రోజే 140 మంది మరణించారు. ► స్పెయిన్‌లో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో 900 మందికిపైగా మరణించారు. అయితే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం ► కరోనా మృతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఇటలీలో వైద్య రంగంపై తీవ్రమైన పని ఒత్తిడి పడింది. దీంతో 10 వేల మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 69 మంది డాక్టర్లు మరణించారు. ► కరోనా మృతులకు నివాళులర్పించడానికి దేశవ్యాప్తంగా శనివారం సంతాపదినంగా చైనా పాటించనుంది. వైరస్‌ను తొలిసారిగా గుర్తించి ప్రాణ త్యాగం చేసిన డాక్టర్ లీ సహా 3,300 మందికి పైగా మరణించారు. వీరి మృతికి నివాళులర్పించడానికి జాతీయ సంతాపం దినంగా పాటించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. -
ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు
న్యూఢిల్లీ: ‘ఐదేళ్ల పిల్లల ఆరోగ్యంపై యునెటైడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో తాను మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి కాజోల్ అన్నారు. యూఎన్ సర్వసభ్య సమావేశాల్లో తాను మాట్లాడటం ఇది రెండోసారని ఆమె తెలిపారు. కాగా పిల్లల ఆరోగ్యంలో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా కీలకమని తాను చెప్పిన విషయం అందరికీ నచ్చిందన్నారు. ‘ఇక్కడ నా స్పీచ్‌కు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది..’అని గొప్పగా చెప్పారు. లైఫ్‌బాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘హ్యాండ్‌వాష్ క్యాంపైన్’లో భాగంగా ఆమె మాట్లాడారు. చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిన్నారులు డయేరియా వంటి అంటువ్యాధుల బారిన పడే అవకాశముందని ఆమె తెలిపారు. ‘చేతులు శుభ్రం చేసుకోవడమనేది చాలా ముఖ్యమైన, ప్రాథమికమైన అంశం.. అంటువ్యాధుల గురించి మాట్లాడే ప్రతిఒక్కరూ ఈ అంశం ప్రాధాన్యతను అర్థం చేసుకునే ఉంటారు. 0-2 ఏళ్ల లోపు పిల్లల్లో అధిక శాతం ఈ అంటువ్యాధుల బారిన పడుతున్నారు..’ అని కాజోల్ వివరించారు.